గంగాధర, మార్చి 13: సాగునీటి కోసం గంగాధర మండల రైతలు కదం తొక్కారు. చొప్పదండి నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయని, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో చేశారు. అప్పటికే చొప్పదండి సీఐ ప్రకాశ్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బీఆర్ఎస్ నాయకులను వెంటాడి అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.
నాయకులు, రైతులు రెండు చోట్ల ధర్నాకు దిగడంతో హఠాత్పరిణామానికి గురైన పోలీసులు రెండు చోట్లకు పరిగెత్తుకు వెళ్లి రైతులు, బీఆర్ఎస్ నాయకులను పకకు తీసుకెళ్లారు. పార్టీ ముఖ్య నాయకులను అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ధర్నాలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, నాయకులు కంకణాల విజేందర్‌రెడ్డి, వేముల దామోదర్, మడ్లపల్లి గంగాధర్, రామిడి సురేందర్, ముకెర మల్లేశం, వడ్లూరి ఆదిమల్లు, తడిగొప్పుల రమేశ్, దోమకొండ మల్లయ్య, మామిడిపల్లి అఖిల్, సుంకె అనిల్, జలంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.