కరీంనగర్ మిల్లర్స్ అసోసియేషన్‌లో అక్రమాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. ఇప్పటికే ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు సంచలనం రేపగా, వివిధ కారణాలు చూపుతూ మిల్లర్ల నుంచి వసూళ్లకు పాల్పడడం, అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చినట్టు చూపడం, దీనిపై ఈసీ సభ్యులు నిలదీయడం, ఇవ్వకుండానే ఇచ్చినట్టు లెక్కలు వేయడం.. వంటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, అధికారులకు ముడుపుల వ్యవహారంపై కలెక్టర్ పమేల సత్పతి సీరియస్ అయినట్టు తెలుస్తున్నది. అంతేకాదు, దీనిపై నిగ్గు తేల్చాలన్న నిర్ణయానికి వచ్చి, నమ్మకమైన అధికారవర్గాల ద్వారా పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
మరోవైపు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ మిల్లర్స్ అసోసియేషన్‌కు తాజాగా నోటీసు ఇచ్చారు. పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని అల్టిమేటం జారీ చేశారు. దీంతో ముడుపుల బాగోతాన్ని కప్పిపుచ్చడంతోపాటు పక్కదారి పట్టించేందుకు కొంత మంది అసోసియేషన్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై వివరణ ఇచ్చేందుకు కలిసి రావాలని కొంతమంది ఈసీ సభ్యులను, మిల్లర్లను కోరగా.. వారు నిరాకరించడమే కాదు, వాస్తవాలు బయటకు రావాల్సిందేనని నిక్కచ్చిగా చెప్పినట్టు తెలుస్తున్నది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా, ప్రస్తుతం నోటీస్ వ్యవహారం మిల్లర్లలో చర్చనీయాంశమవుతున్నది.
కరీంనగర్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరీంనగర్ జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్‌లో ఇటీవలి కాలంలో జరుగుతున్న అక్రమాలపై స్వయంగా మిల్లర్లే భగ్గుమంటున్నారు. వివిధ కారణాలు చూపుతూ వసూలు చేస్తున్న డబ్బులను స్వయంగా కొంత మంది వెనకేసుకుంటున్న తీరు వెలుగులోకి వస్తుండడంతో మండిపడుతున్నారు. మిల్లర్లకు అండగా నిలువాల్సిన అసోసియేషనే పక్కదారి పడితే.. తప్పుడు పద్ధతుల్లో ముందుకెళ్తే ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు.
అక్రమాలు బహిర్గతం
రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో జరిగిన అక్రమాలు, బైలాకు విరుద్ధంగా చేసిన ఖర్చులు, అధికారులకు ముడుపులు, ఈసీ సమావేశంలో నిలదీసిన సభ్యులు, ఆ మేరకు సమాధానం చెప్పలేక బెదిరింపులు.. ఇలా అనేక అంశాలను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. గత నెల 28న ‘రైస్‌మిల్లర్స్ అసోసియేషన్‌లో 2 కోట్ల గోల్మాల్?’.. అలాగే 29న ‘రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నుంచి అధికారులకు భారీ ముడుపులు?’.. 30న ‘అధికారుల పేరుతో హాంఫట్?’.. శీర్షికన ప్రచురించిన కథనాలు సంచలనం రేపాయి. ఉమ్మడి జిల్లా మిల్లర్లలో హాట్‌టాపిక్‌గా మారాయి.
ఇటీవలి ఈసీ మీటింగ్‌లో వివిధ అంశాలతోపాటు అధికారులకు ముడుపుల విషయంపై జోరుగా చర్చ జరిగింది. అందులో ఒక ఉన్నతాధికారికి 15 లక్షలు ఇచ్చినట్టు నాయకులు చెప్పడం.. అది ఓసారి 5 లక్షలు, మరోసారి 10 లక్షలు ఇచ్చినట్టుగా చెప్పడంతో ఈసీ సభ్యులు ఫైర్ అయిన విషయం తెలిసిందే. వీరితోపాటు పౌరసరఫరాల విభాగానికి చెందిన మరో ఇద్దరు ఉన్నతాధికారులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఇచ్చినట్టు లెక్కలు చూపడం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది బహిర్గతం కావడంతో ఏకంగా సదరు అధికారులు అవాక్కయ్యారు. తమకు పైసా ఇవ్వకుండా తమ పేరిట ఇన్ని డబ్బులు లెక్కల్లో చూపడం ఏమిటని కొంత మంది మిల్లర్లకు ఫోన్ చేసి ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. అంతేకాదు, ఇదే ఈ విషయాన్ని స్వయంగా ఒక అధికారి ఈసీ సభ్యులకు ఫోన్ చేసి వివరించినట్టు తెలిసింది.
నిజాలు నిగ్గు తేలాల్సిందే
అదనపు కలెక్టర్ నోటీస్‌తో ఆగమవుతున్న అసోసియేషన్ ఇప్పుడు దానిని ఎలాగైనా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఒక మిల్లర్ రంగంలోకి దిగి ఈసీ సభ్యులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ ముడుపుల వ్యవహారం ఏమీ లేదని చెప్పేందుకు ముందుకు రావాలని సదరు సభ్యులను కోరడమే కాకుండా.. లిఖిత పూర్వక వివరణకు మీరంతా సంతకాలు పెట్టాలని కోరినట్టు సమాచారం. అయితే, ఈ విషయంలో నిగ్గు తేలాల్సిందేనని సదరు ఈసీ సభ్యులు తేల్చిచెబుతున్నారు.
వక్రమార్గాలు, పక్కదారుల్లో వచ్చి తమను ప్రలోభాలకు గురిచేసినా.. లేదా బెదిరింపులకు పాల్పడినా.. తామే తమ వద్ద ఉన్న ఆధారాలను, వాయిస్ రికార్డులను తీసుకెళ్లి ఉన్నతాధికారులకు ఇస్తామని ఓ ఈసీ సభ్యుడు తెగేసి చెప్పినట్లుగా తెలుస్తున్నది. ఒక వేళ ముడుపులు ఇచ్చింది నిజమే అయితే.. ఇచ్చినట్టుగానే వివరణ రాసి పంపిద్దామని కొంత మంది మిల్లర్లు సూచనలు చేసినట్టు సమాచారం. ఒకవేళ ఇవ్వకపోతే ఆ డబ్బులన్నీ ఏమయ్యాయో..? లెక్కలు ముందుగా ఈసీ కమిటీకి చెప్పాలని ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఇవేకాదు, వివిధ ఖర్చుల పేరిట ఇచ్చినట్టు చూపుతున్న లెక్కలు, చందాల పేరిట రాసి చూపుతున్న వ్యవహారాలు మొత్తం బయటకు రావాల్సిందేనంటూ పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది.
మిల్లర్లు రాత్రింబవళ్లు కష్టపడి చెమటోడ్చితే చందాలు, ముడుపుల పేరిట వసూలు చేసిన లెక్కలను చెప్పకపోతే ఎలా? అని సూటిగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే.. మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రా రైస్ మిల్లుల్లో కొన్ని డిఫాల్ట్ ఉన్నాయని గత యాసంగిలో సీఎంఆర్ కేటాయింపు చేయాలని ఓ అధికారి తెగేసి చెబితే.. ఆ సాకును చూపి కొంత మంది రా రైస్ మిల్లర్ల వద్ద కూడా డబ్బులు వసూలు చేసి సదరు అధికారికి ఇచ్చినట్టు చూపడం మిల్లర్లలో పెద్ద చర్చ నడుస్తున్నది. దీనికి సంబంధించి మరింత స్పష్టమైన సమాచారం అందాల్సి ఉండగా.. అతి త్వరలోనే రా రైస్‌మిల్లు పేరిట కొంత మంది సాగించిన వసూళ్ల పర్వం కూడా బయటకు వచ్చే అవకాశమున్నది. ప్రధానంగా అసోసియేషన్‌లో తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. నిజానికి మెజార్టీ మిల్లర్లు నిబంధనలకు లోబడి పనిచేసుకుంటున్నారు.
సీఎంఆర్ నుంచి మొదలు కొని.. ఇతర ప్రతి విషయంలోనూ నిబంధనలను అతిక్రమించకుండా మిల్లులను నడుపుతున్నారు. అయితే, కొంత మంది చేసిన అక్రమాలు, ఆగడాలను కప్పి పుచ్చేందుకు అసోసియేషన్ అన్ని మిల్లుల నుంచి డబ్బులు వసూలు చేసి.. వాటిని అధికారులు, ఇతరులకు ఇచ్చినట్టు సాకు చూపి వెనకేసుకుంటున్నారన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతున్నది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేయాల్సిన అసోసియేషన్ అటువంటి చర్యలు తీసుకోకపోగా.. వారికే పెద్ద పీట వేస్తూ అన్ని అర్హతలు, నిబంధనలు పాటించే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్ ఆరా! నోటీస్ జారీ
అధికారులకు ముడుపుల వ్యవహారం బహిర్గతమైన తీరు ప్రస్తుతం అధికారుల్లో కలకలం రేపుతున్నది. మరోవైపు ఇవ్వని డబ్బులను ఇచ్చినట్టు రికార్డుల్లో చూపిన అసోసియేషన్ తీరుపైనా మిల్లర్లలో పెద్ద చర్చ నడుస్తున్నది. దీంతో పాటు అసోసియేషన్‌లో జరిగిన అక్రమాలు, లావాదేవీల తీరు తెన్నులను కొంత మంది మిల్లర్లు ఆధారాలతో సహా ఓ ఉన్నతాధికారికి సమర్పించినట్టు తెలుస్తున్నది. మరోవైపు ముడుపుల వ్యవహారం ప్రస్తుతం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ చర్చకు దారి తీసింది. దీంతో కలెక్టర్ పమేల సత్పతి ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అక్కడితో ఆగకుండా తనకు అత్యంత నమ్మకమైన అధికారులతో ఒక వైపు వివరాలను సేకరిస్తూ, పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మిల్లర్స్ అసోసియేషన్‌కు అడిషనల్ కలెక్టర్ నోటీస్ ఇచ్చారు. దీనిపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని సదరు నోటీస్‌లో స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.