.. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలు నాడు నీళ్లు లేక రైతులు ఎదుర్కొన్న దుర్భిక్ష పరిస్థితులను.. నేడు పుష్కలమైన నీటి వనరులతో రైతన్న ఇంట సిరుల పంటలను కండ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరులో తీసిన ఈ చిత్రాలు తెలంగాణ రాక ముందు, వచ్చిన తర్వాత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. నాడు యాసంగిలో వరి పండించడం రైతులకు గగనమే అయ్యేది. ఎస్సారెస్పీ కాలువ చివరన ఉన్న ఇక్కడి భూములకు సరిపడా సాగు నీరందేది కాదు. ఎండకాలానికి ముందే చెరువులు, కుంటల్లో చుక్క నీరుండేది కాదు. కరెంట్ ఉండక మోటర్లు నడిచేది కాదు.
దీంతో పంటలు మధ్యలోనే ఎండిపోయేవి. కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో సాగు పండుగలా మారింది. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలకు జీవం పోయడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడం, ఎస్సారెస్పీ కాలువ చివరి గ్రామాలకు నీరందించడం, 24 గంటలపాటు ఉచిత కరంట్ ఇవ్వడం కలిసివచ్చింది. నాడు గ్రామంలో 60 శాతం మాత్రమే సాగు కాగా, నేడు అదనంగా 40 శాతం భూములు పచ్చగా మారాయి. ఇప్పుడు కొలనూర్ ఒక్క వ్యవసాయంలోనే కాదు, అన్నింటా దూసుకెళ్తున్నది. సాగు, తాగునీటి సమస్య పరిష్కారం కావడంతోపాటు అభివృద్ధిలోనూ ఆదర్శంగా మారింది. నాటికీ నేటికీ కనిపిస్తుండగా, ఈ గ్రామం తెలంగాణ సర్కారు పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
– ఓదెల, మే 21
సమైక్యపాలనలో సమస్యలతో కునారిల్లిన కొలనూర్ గ్రామం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. నాడు చుక్క నీరు లేక ఎడారిని తలపించిన చెరువులు నేడు నట్టెండలోనూ మత్తళ్లు దుంకుతున్నాయి. సాగు నీరు లేక పశువుల మేతగా మారిన పొలాలు పసిడి పంటలు పండిస్తున్నాయి. మరోవైపు వానొస్తే బురదమయ్యే రోడ్లన్నీ సీసీ రోడ్లయ్యాయి. ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రకృతివనం, చెత్తకు డంపింగ్ యార్డు, చివరికి చింత లేకుండా వైకుంఠధామం, ఎవుసం ముచ్చట్లకు రైతు వేదికను నిర్మించుకొని తొమ్మిదేళ్లలో కొలనూర్ తన రూపురేఖలను మార్చుకొని ఆదర్శంగా నిలుస్తున్నది.
ఓదెల, మే 21: ఓదెల మండలం కొలనూర్ గ్రామ ప్రజలు 2015కు ముందు అనేక సమస్యలతో సతమతమమ్యేవారు. ఇక్కడ 5303 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. 6 వేల వరకు జనాభా, 3586 వరకు ఓటర్లు ఉన్నారు. 1252 ఇండ్లు ఉన్నాయి. తెలంగాణ రాక ముందు ఇక్కడి రైతులు పంటలు పండించడం గగనమే అయ్యేది. యాసంగిలో చెరువులు, కుంటలలో చుక్క నీరు లేక ఎడారిని తలపించేవి. కరెంట్ సక్రమంగా ఉండకపోయేది. ఎస్సారెస్పీ కాల్వ నీరు గ్రామం వరకు అందేది కాదు. ఇలా అనేక రకాల ఇబ్బందులతో రైతులు వేసిన పంటలకు సాగునీరందక పశువుల మేతగా మారేది. ఇవి తెలంగాణ రాకముందు పరిస్థితులు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీఎం కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుపుకుని ఎస్సారెస్పీ కాల్వల ద్వారా చివరి గ్రామాల వరకు ఏప్రిల్ నెల వరకు కాల్వ నీరందుతున్నది. గ్రామాల్లోని చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా అభివృద్ధి చేసి వాటిని ఎస్సారెస్పీ కాల్వలకు అనుసంధానం చేసి నింపడంతో ఎండకాలంలోనూ మత్తళ్లు దుంకుతున్నాయి. దీంతో ప్రస్తుతం మే నెలలో కూడా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా కరంట్ ఇస్తుండడంతో ఏ బాధలు లేకుండా వ్యవసాయం సాఫీగా జరిగి రైతుల ఇంట సిరులను కురుపిస్తున్నాయి. సాగు నీళ్లుకు ఎలాంటి కొరత లేకుండా ప్రభుత్వం చూస్తుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. దండగ అనుకున్న వ్యవసాయం ఇప్పుడు పండుగలా మారింది. బీడు భూములన్నీ ఇప్పుడు సాగులోకి వచ్చాయి. స్వరాష్ట్రంలో అదనంగా దాదాపు 40శాతం భూములు సాగులోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
ప్రజలకు మౌలిక వసతుల కల్పన
గ్రామంలోని ప్రజలకు మౌళిక వసతులు కల్పించారు. నాడు వానకాలం వస్తే రోడ్లన్నీ బురదమయమై చిత్తడిగా నెలకొనేది. ఇప్పుడు గ్రామంలో పట్టణాన్ని తలపించే విధంగా వాడవాడలా సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయి. గ్రామంలో రూ. కోటి నిధులతో వివిధ వాడలా సీసీ రోడ్ల నిర్మాణాలు జరిగాయి. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇండ్లలోని చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. గ్రామంలో ఆహ్లాదకరంగా ఉండేలా రూ.6,75,963తో పల్లె ప్రకృతి వనం రూపుదిద్దుకుంది. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి రూ.21 లక్షలతో రైతు వేదిక ఏర్పాటు చేశారు. రూ. 12,11,151తో వైకుంఠధామం నిర్మించారు. మిషన్ కాకతీయలో ఇక్కడి ఊర చెరువు అభివృద్ధి చెందింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో కరెంట్ సమస్యలు తీర్చారు. మన ఊరు- మన బడి పథకంలో ఇక్కడి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో కావాల్సిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పరిశుభ్రతలో ఈ గ్రామానికి ఇటీవల అందించిన ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా దక్కింది. గతంతో పోలిస్తే ఈ తొమ్మిదేళ్లలో ఇక్కడ రైతులు, ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటయ్యాయి.
కేసీఆర్ అచ్చినంక అన్నీ మంచిగ జరుగుతున్నయ్
కేసీఆర్ సార్ అచ్చినంక రైతులకుగాని, ప్రజలకు అన్ని మంచిగ చేత్తుండు. నేను పుట్టి గింతైన గానీ ఎండకాలంలో చెరువులు మత్తడు పడ్డది గిప్పుడే జూసిన. మేం ఎవుసం చేసినప్పుడైతే ఎండకాలం రాకముందే చెరువులు ఎండిపోయేది. చెరువును లోతు చేసి కట్టను, మత్తడిని మంచిగ చేయడంతో గిప్పుడు గూడ నీళ్లు ఉండడం చూత్తే మంచిగనిపిత్తంది. ఊర్ల కూడా శ్మశానవాటిక కట్టిన్రు. సిమెంట్ రోడ్లు ఏసిన్రు. చెట్లను పెంచుతున్రు. రైతులందరు ఒకదగ్గర కూసొని కష్టసుఖాలు చెప్పుకునేందుకు బిల్డింగ్ కట్టిర్రు. ఇండ్లళ్లనే మంచినీళ్లు పట్టుకునేందుకు నల్లాలను పెట్టిండ్రు. గిట్లా కేసీఆర్ సార్ సాన మంచి పనులు జేత్తుండు. మా వయసుల గివేమీ లేకపాయె.
– అమరగాని కొమురయ్య, వృద్ధుడు, కొలనూర్(ఓదెల)