సొంతిల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వ పెద్దలు అట్టహాసంగా ప్రకటిస్తున్నా.. అమలులో మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఇండ్లపై ఆశలు పెట్టుకున్న వారిలో ప్రభుత్వ తీరుతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇండ్లు మంజూరై.. నిర్మాణాలపై ఆసక్తి చూపని వారికి రద్దు చేసిన అధికారయంత్రాంగం, వారి స్థానంలో కొత్తవారి ఎంపిక చేయకపోవడంపై అసహనం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 9 : సొంతింటి కలను నెరవేర్చుతామంటూ ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత మొండిచేయి చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఇల్లు మంజూరైనా కాంగ్రెస్ నేతల మాటల్లాగానే కట్టుకునే వరకు గ్యారెంటీ లేకుండా పోతున్నది. వివిధ కారణాలతో ఇండ్లను రద్దు చేస్తున్నా.. కొత్త వారికి అందించడంలో జాప్యం చేస్తున్నది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు రెండు విడతల్లో 8,239 ఇండ్లు మంజూరు కాగా, అందులో అత్యధిక శాతం బేస్మెంట్ స్థాయిని దాటించలేదు. కొంతమంది ముగ్గు పోసినా పునాదులు కూడా తీయలేదు. ఆర్థిక వనరులు లేక పనులు ప్రారంభించని 863 మంది ఇండ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. తామే స్వచ్ఛంధంగా ఇండ్లు వదులుకుంటున్నట్లు వారి నుంచి లిఖిత పూర్వక పత్రాలు కూడా తీసుకున్నారు. ఈ జాబితాను ఉన్నతాధికారులకు పంపి పదిహేను రోజులు దాటినట్టు తెలుస్తుండగా, కొత్తవారి ఎంపికపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. మంజూరైన ఇండ్లలో గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా రద్దు కాగా, అర్హులైన వారు కూడా అదేస్థాయిలో వేచిచూస్తున్నారు. ప్రాధాన్యతా క్రమంలో మంజూరు చేస్తే వెంటనే ఇండ్ల నిర్మాణాలు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ, అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తుండడంపై ఆశావహులు మండిపడుతున్నారు. ఇటు మంజూరైన ఇండ్లు వదులుకునేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నా, తమ ఇష్ట ప్రకారమే వదులుకుంటున్నట్టు లబ్ధిదారుల నుంచి లేఖలు తీసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ పనుల సీజన్లో కూలీలంతా పనులకు వెళ్లి నాలుగు డబ్బులు జమచేసుకునే సమయంలో ఇండ్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంతో ‘ఇచ్చిన గడువు ముగిసింది. కేటాయించిన ఇండ్లు రద్దు చేస్తున్నాం’ అంటూ ప్రకటించినట్టు తెలిసింది. దీంతో, చేసేదేమీ లేక నిస్సహాయంగా మారిన లబ్ధిదారులకు ‘మళ్లీ మీకు తర్వాత ఇల్లు మంజూరు చేస్తాం’ అంటూ అధికారులు హామీ ఇవ్వడంతో మంజూరైన ఇల్లును తామే వదులుకుంటున్నట్లు లిఖిత పూర్వక పత్రాలు ఇచ్చారు. అయితే, వీరి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉన్నా ఇంకా ఆ దిశగా చర్యలు చేపట్టలేదని తెలుస్తున్నది. అయితే వరి కోతలు మొదలైన తర్వాత ఎంపిక చేసి పనులు ఇండ్ల నిర్మాణ ప్రారంభించాలని ఆదేశిస్తే, మంజూరైన ఇండ్లను పాతవారి లాగే తాము కూడా వదులుకోవాల్సి వస్తుందనే ఆవేదన ఆశావహుల నుంచి వ్యక్తమవుతున్నది. అధికారులు మాత్రం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. రద్దయిన వారి జాబితాను పునఃపరిశీలించి, అత్యంత పేదరికంలో ఉన్న వారిని గుర్తించి స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలిప్పించి ఇండ్ల నిర్మాణం చేపట్టే యోచనలో ఉన్నట్టు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారిని గుర్తించే ప్రక్రియ క్షేత్రస్థాయిలో నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్నదని వెల్లడిస్తున్నారు. ఇప్పటికైనా ఇండ్లు వదులుకున్న వారి స్థానంలో కొత్తవారిని గుర్తించి, నిర్మాణానికి ప్రొసీడింగ్లు అందజేస్తే వెంటనే ఇండ్ల నిర్మాణాలు మొదలు పెట్టే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.