అసలే వర్షాలు లేక ఆకాశం వైపు ఆశగా చూస్తున్న అన్నదాత, పోసిన వరి నార్లు కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. బావులు, బోర్లలో ఉన్న కొద్ది పాటి నీటితోనైనా దక్కించుకోవాలని చూస్తే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి అసలుకే మోసం జరుగుతున్నది. గంగాధర మండలంలో ఒకే నెలలోనే 72 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది.
గంగాధర, జూలై 7 : గంగాధర మండలకేంద్రంతో పాటు ఆచంపల్లిలో విద్యుత్ సబ్ డివిజన్లు ఉన్నాయి. కాగా, జూన్‌లో గంగాధర సబ్ డివిజన్ పరిధిలో 48, ఆచంపల్లి సబ్ డివిజన్ పరిధిలో 24 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. లైన్లలో లోపం, లూజ్ వైర్లు, లోవోల్టోజీ, పిడుగుల పడి, గాలి దుమారం వంటి సమస్యలతో నెల వ్యవధిలోనే రెండింటి పరిధిలో 72 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినట్లు విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ట్రాన్స్ఫార్మర్లలో మరమ్మతులో నాణ్యత పాటించకపోవడంతోనే బిగించిన నాలుగు రోజుల్లోనే మళ్లీ కాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా మరమ్మతులకు నోచుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత 48 గంటల్లోగా ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేయించి బిగించాల్సి ఉండగా.. పదిహేను రోజులైనా మరమ్మతులు చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఒకే నెలలో 72 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంపై విద్యుత్ శాఖ అధికారులు తలోమాట మాట్లాడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడానికి 80 శాతం లూజ్ వైర్లు, లోవోల్టేజీ అని విద్యుత్ శాఖ డీఈ కాళిదాసు తెలిపారు. వానకాలంలో పిడుగులు పడడం, గాలిదుమారంతోనే ఎక్కువగా కాలిపోతున్నాయని ఏఈ తిరుపతి చెప్పారు. విద్యుత్ సమస్యలపై ఇద్దరు అధికారులు వేర్వేరు సమాధానాలు చెప్పడం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.
మా బూరుగుపల్లిలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తరచూ కాలిపోతున్నది. పదిహేను రోజుల క్రితం కాలిపోతె బస్టాండ్ ఏరియాలో నాలుగు గంటల పాటు కరెంటు పోయింది. ఇప్పటికే మూడు సార్లు రిపేర్ చేసి బిగిస్తే మూడు సార్లు కాలిపోయింది. పనుల్లో నాణ్యత లోపంతోనే ఇలా జరిగుతోంది.
– గడ్డం స్వామి, రైతు (బూరుగుపల్లి)
విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో మేం తీవ్ర ఇబ్బంది పడుతున్నం. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరు. మేమే సొంత ఖర్చుతో గంగాధరకు తీసుకెళ్లి రిపేర్ చేయించుకుంటున్నం. నాణ్యతా లోపంతో నాలుగు రోజులకే మళ్లీ కాలిపోతున్నది. దీంతో పంటలను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నం.
– జుర్రు రవి, రైతు (లింగంపల్లి)
80 శాతం లూజ్‌వైర్లు, లోవోల్టేజీతోనే జూన్‌లో ట్రాన్స్ఫార్మర్లలో కాలిపోయాయి. మిగిలిన 20 శాతం పిడుగులు, ఇతర కారణాలతో కాలిపోయాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత టౌన్లో అయితే 24 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల్లో మరమ్మతులు చేస్తాం. పనుల్లో నాణ్యతా లోపం ఏమీ లేదు.
– కాళిదాసు, డీఈ