మున్ముందు ఎరువులకు ఇబ్బంది రానున్నదా..? సకాలంలో కేటాయింపులు లేకుంటే కొరత తీవ్రం కానున్నదా..? అంటే అధికారుల అంచనాల ప్రకారం అవుననే తెలుస్తున్నది. ముఖ్యంగా సాగులో అత్యధికంగా వినియోగించే యూరియాకు వచ్చే నెలలో తీవ్రమైన కొరత ఏర్పడనున్నదని స్పష్టమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎరువులు సరఫరా చేయడం లేదని ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రకటన, ప్రస్తుతం ఉన్న ఎరువుల నిల్వలపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. వచ్చే నెలలో వరి, మక్క, పత్తి పంటలకు కీలకం కానున్న యూరియాకు కొరత ఏర్పడితే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఈ నెలలో కేటాయింపులు జరిగితేనే కొరత లేకుండా ఉంటుందని, లేదంటే తాము రోడ్డెక్కాల్సి వస్తుందని రైతాంగం వాపోతున్నది.
కరీంనగర్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవ పరిస్థితికి అందుకు భిన్నంగా ఉన్నది. కరీంనగర్ జిల్లాలో చూస్తే ఈ నెలకు సరిపడే నిల్వలే ఉండగా, మున్ముందు కొరత తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా ఈ నెలలో యూరియా కేటాయింపులు లేకుంటే వచ్చే నెలలో ఇబ్బంది పడే ముప్పు ఉన్నది. జిల్లాలో 3,43,240 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని, అందులో 2,76,500 ఎకరాల్లో వరి, 4 వేల ఎకరాల్లో మక్క, 43 వేల ఎకరాల్లో పత్తి సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా యూరియా 43,254 మెట్రిక్ టన్నులు, డీఏపీ 6,945, కాంప్లెక్స్ 26,957, ఎంవోపీ 7,730 మెట్రిక్ టన్నులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. ఏప్రిల్ వరకు ఓపెన్ బ్యాలెన్స్ చూస్తే యూరియా 13,140, డీఏపీ 628, కాంప్లెక్స్ 16,131, ఎంఓపీ 4,417 మెట్రిక్ టన్నుల నిలువ ఉండగా, కొత్తగా యూరియా 10,603, డీఏపీ 7,011, కాంప్లెక్స్ 21,855, ఎంవోపీ 957 మెట్రిక్ టన్నులు కేటాయించారు.
అందులో ఇతర జిల్లాలు, కరీంనగర్ జిల్లా రైతులకు ఇప్పటి వరకు విక్రయించిన ఎరువులు పోను ఇంకా యూరియా 20,124, డీఏపీ 2,264, కాంప్లెక్స్ 33,201, ఎంఓపీ 3,598 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. ఈ నెలలో ఇటు వరి నాట్లు పుంజుకొని, పత్తి, మక్క ఎదిగే క్రమంలో ఒక్క యూరియానే 12,976 మెట్రిక్ టన్నులు అవసరముంటుంది. ఇప్పుడున్న 20,124 మెట్రిక్ టన్నుల నుంచి ఈ మొత్తాన్ని వినియోగిస్తే 7,148 మెట్రిక్ టన్నులు మాత్రమే మిగులుతుంది. అధికారుల అంచనా ప్రకారం ఆగస్టులో 15,139 మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది. ఇక డీఏపీకి ఈ నెలలోనే కొరత ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఈ నెల 25 వరకు 2,778 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరం ఉండనుండగా, ప్రస్తుతం 2,264 మెట్రిక్ టన్నులే అందుబాటులో ఉన్నది. కాంప్లెక్స్, ఎంవోపీ నిల్వలు కూడా ఈ నెలలో వినియోగిస్తే వచ్చే నెలలో కొరత ఏర్పడే ముప్పు స్పష్టంగా కనిపిస్తున్నది.
ఎరువులు సకాలంలో కేటాయించకుంటే తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నది. ప్రధానమైన వరి, మక్క, పత్తి పంటలకు ఎక్కువగా ఎరువులు వినియోగిస్తుండగా, కీలక దశలో ఎరువుల కేటాయింపు తగిన రీతిలో లేకుంటే రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే డీఏపీ కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అవసరానికి తగినట్లు సరఫరా లేదని వాపోతున్నారు. ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్ ఎరువులు కూడా వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నప్పటికీ డీఏపీ వాడినంత ఫలితం ఉండక పోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ నెలలో సరిపడా ఎరువులు కేటాయించకుంటే రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి అవసరమైన ఎరువులు సరఫరా చేయడం లేదని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎరువులకు ఎలాంటి కొరత ఏర్పడ లేదని రైతులు గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సకాలంలో ఎరువులు కేటాయిస్తేనే కొరత లేకుండా ఉంటుందని చెబుతున్నారు.
ఎరువులకు ఎలాంటి కొరత లేదు. వచ్చే నెల వరకు అవసరమైన నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం అవసరం ఉన్న డీఏపీ 200 మెట్రిక్ టన్నులు విడుదల చేశాం. అన్ని కేంద్రాల్లో ఈ ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయి. యూరియాను రైతులు అవసరానికి మించి వాడుతున్నారు. దీనిపై సీజన్ ప్రారంభానికి ముందు గత వేసవిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. యూరియా పైపాటుగా వేసినప్పుడు ఎకరానికి ఒక బస్తా వేసుకుంటే సరిపోతుంది. కానీ, రైతులు రెండు మూడు బస్తాలు వాడుతున్నారు. ఫలితంగా భూమి, నీరు, గాలిలో కాలుష్యం పెరుగుతున్నది. అందుకే వినియోగాన్ని కొంత వరకు నివారించాలని నిర్ణయించాం. మక్కలో ఎకరానికి ఐదారు బస్తాలు వేస్తున్నారు. దీనివల్ల కత్తెర పురుగు, మొగి పురుగు వంటి తెగుళ్లు ఆశిస్తున్నాయి. దిగుబడి కూడా తగ్గుతుంది. ఎకరానికి 3 బస్తాల కంటే తక్కువే వేసుకోవాలని మేం సిఫారసు చేస్తున్నాం. అన్ని పంటల్లో యూరియా అధిక మోతాదులో వాడుతుండడం దుష్పరిణామాలకు కారణమవుతున్నది. రైతులకు నా విజ్ఞప్తి ఏమిటంటే వ్యవసాయ అధికారులు సూచించిన ప్రకారమే ఎరువులు వాడి, మంచి దిగుబగడి సాధించాలి.
ప్రభుత్వం ఎరువులు నేరుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో సెంటర్లకు కేటాయిస్తున్నది. యూరియా మాత్రం పీఏసీఎస్కే కేటాయిస్తుండగా, ఇతర ఎరువులు ప్రైవేట్ డీలర్లకు ఇస్తున్నారు. యూరియాను అధికంగా వినియోగించడం ఇతర పరిణామాలకు దారితీస్తున్నదని వ్యవసాయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించామని చెబుతున్నారు. ఇప్పటి వరకు వర్షాలు అనుకూలించక పోవడంతో వ్యవసాయ పనులు ఇంకా వేగవంతం కాలేదు. వర్షాలు అనుకూలించి పనులు పుంజుకుంటే ముందుగా నాట్లు వేసే ముందు అడుగు మందుగా వాడేందుకు డీఏపీ అవసరం ఉంటుంది. రెండు రోజుల కిందనే 200 మెట్రిక్ టన్నులు పీఏసీఎస్‌కు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ నెలలో ప్రభుత్వం సరఫరా చేయకుంటే డీఏపీకి కొరత ఏర్పడే ముప్పు ఉన్నది. నాట్లు వేసిన నెల తర్వాత యూరియా వినియోగం ఒక్కసారిగా పెరుగుతుంది. అటు పత్తి కూడా మోకాలు ఎత్తుకు పెరిగితే ఆ పంటకు కూడా యూరియా అవసరముంటుంది. ఇటు మక్కకు కూడా అదే స్థాయిలో వాడతారు. వరి చేతికి వచ్చే సరికి కనీసం మూడు సార్లయినా పైపాటుగా యూరియా వినియోగిస్తారు. ఈ సమయంలో యూరియాకు తీవ్రమైన కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు.