కరీంనగర్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25 వేల పరిహారం చెల్లించాలని రైతాంగం ప్రభుత్వాన్ని డిమాం డ్ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్ ధాన్యానికి 500ల బోనస్ చెల్లించాలని, 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు శనివారం ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపట్టగా, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గులాబీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ తీరుపై భగ్గుమన్నారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయని, తాము పెట్టుబడులు నష్టపోతున్నామని మండిపడ్డారు. అయినా పాలకులు స్పందించడం లేదని, కనీసం కన్నెత్తి చూడడం లేదని ఆవేదన చెందారు. ఏడు పదుల వయసులో కేసీఆర్ ఎర్రటి ఎండలో పంటలను పరిశీలించి తమకు ధైర్యం చెప్పారని, నాయకుడంటే ఇలా ఉండాలని స్ప ష్టం చేస్తున్నారు. కానీ, రేవంత్ మాత్రం క్రికెట్ మ్యాచ్ లు చూస్తున్నాడని, రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శించారు. ఇటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. అన్నదాతకు న్యాయం చేసేదాకా పోరాడుతామని స్ప ష్టం చేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కరీంనగర్, మానకొండూర్‌లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, కరీంనగర్లో ఎ మ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్‌లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, మెట్పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల హాజరయ్యారు. వీరితోపాటు ఆయా నియోజకవర్గాల్లో మాజీ ఎ మ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.