ఓదెల : ఓదెల మండలంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం, బలమైన ఈదురు గాలుల కారణంగా మడక గ్రామంలో కరెంటు వైర్ తెగి విద్యుత్ షాక్‌తో ( Electrocution ) 25 గొర్రెలు( Sheeps ) మృతి చెందాయి. గొర్రెల కాపరి వేల్పుల రాజ కొమురయ్య తన ఇంటి పక్కన గొర్రెల మందను రాత్రి ఇనుప కంచెలో ఉంచారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ( Heavy Rains ) కురిసింది. ఈ సందర్భంగా కరెంటు వైర్ తెగి గొర్రెల మందపై పడడంతో కరెంటు షాక్ తగిలి 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
తెల్లవారుజాము సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చి చూడగా కరెంటు వైర్ తెగి 25 గొర్రెలు మృతి చెందిన విషయాన్ని గమనించినట్టు బాధితులు తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించడంతో కరెంటు సరఫరాలను నిలిపివేయడంతో తమకు ప్రాణాపాయం తప్పిందని బాధిత గొర్రెల కాపరి యజమాని రాజ కొమురయ్య తెలిపారు.
ఈ ప్రమాదంలో రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. కరెంటు వైర్ తెగిపడిన సందర్భంలో ప్రాణాపాయం తప్పడంపై కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.