శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Sep 02, 2020 , 02:48:30

ప్రణబ్‌ ముఖర్జీ మృతి దేశానికే తీరని లోటు

ప్రణబ్‌ ముఖర్జీ మృతి దేశానికే తీరని లోటు

  •  మాజీ రాష్ట్రపతికి జిల్లా వ్యాప్తంగా పలువురి నివాళి 

కొత్తపల్లి: మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ మృతి దేశానికే తీరని లోటని అల్ఫోర్స్‌ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ వీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపంగా మంగళవారం వావిలాలపల్లిలోని అల్ఫోర్స్‌ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో ‘ప్రణబ్‌కి ప్రణామ్‌' పేరిట కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రణబ్‌ ముఖర్జీ అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రపతి పదవిని అలంకరించి వన్నె తెచ్చారన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని, ఆయన మరణంతో భారతదేశం గొప్ప నాయకుడిని కోల్పోయినట్లుగా ఉందన్నారు. ఆర్థిక, రక్షణశాఖ మంత్రిగా పనిచేసి అత్యుత్తమ సేవలందించడంతో ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

కార్పొరేషన్‌: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటానికి కరీంనగర్‌లోని కార్యాలయంలో ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో ప్రణబ్‌ ముఖర్జీ ముందు వరుసలో ఉంటారన్నారు. ఆయన మృతితో దేశం ఒక ఆత్మీయుడిని కోల్పోయిందన్నారు.   బీజేపీ నాయకులు బాస సత్యనారాయణ, జయశ్రీ, ఎనుగుల రాకేశ్‌ రెడ్డి, డీ శంకర్‌, రాపర్తి విజయ, అనూప్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, కాంగ్రెస్‌ కార్యాలయంలో ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటం వద్ద పార్టీ నాయకులు  నివాళులర్పించారు. 

తెలంగాణచౌక్‌: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి దేశానికి తీరనిలోటు అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. విలువైన రాజకీయాలకు ముఖర్జీ నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిన నాయకుడని కొనియాడారు.

తెలంగాణచౌక్‌: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల టీఆర్‌ఎస్‌ నాయకురాళ్లు సందవేణి గీతాంజలి, బండ అనిత, సాత్విక, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు నల్ల మంజులత, టీఆర్‌ఎస్‌ నాయకులు జీఎస్‌ ఆనంద్‌, అక్బర్‌, రజక రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకులు రాజేందర్‌, సతీశ్‌ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నాయకుడని కొనియాడారు.


logo