సోమవారం 28 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 07, 2020 , 02:19:45

దూదిపూల ఎవుసం

దూదిపూల ఎవుసం

  • lఉమ్మడి జిల్లాలో పండుగలా పత్తి సేద్యం
  • lసీఎం కేసీఆర్‌ పిలుపుతో   ఊరూరా నియంత్రిత సాగు
  • l‘రైతుబంధు’తో ఉత్సాహంగా పనుల్లో రైతన్న నిమగ్నం
  • lఅనుకూలిస్తున్న వానలతో ఆనందం

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ)

‘మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేస్తేనే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. రైతు కష్టానికి ఫలితం దక్కుతుంది. నియంత్రిత పంటల సాగు విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలి. వ్యవసాయం ఆహార అవసరాలు తీర్చే వృత్తి స్థాయిని దాటి లాభసాటి విధానాలను అవలంబించాల్సిన సమయం ఆసన్నమైంది.’

- వానకాలం సాగుకు ముందు సీఎం కేసీఆర్‌ రైతులకు ఇచ్చిన పిలుపు ఇది.. 

ఆయన ఇచ్చిన పిలుపునకు కట్టుబడి ఉన్న రైతులు ఈ సీజన్‌ నుంచే నియంత్రిత విధానంతో పంటలు సాగు చేస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న పత్తి సాగే ఇందుకు నిదర్శనం. అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ జిల్లాల్లో పండిన పత్తికి మంచి డిమాండ్‌ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈసారి కనీస మద్దతు ధర పెంచింది. దీంతో సీఎం కేసీఆర్‌ చూపిన బాటలోనే సాగేందుకు రైతులు మొగ్గు చూపారు. ఉమ్మడి జిల్లాలో 3,50,151 ఎకరాల్లో సాగు చేయాలని ప్రణాళికలు వేయగా ఇప్పటికే 2,44,461 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. ఈ నెల 15 వరకు పత్తిసాగు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మారుతున్న సాగు విధానం 

కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత కాలం మీద భారం వేసి మొగులు వైపు చూసి పంటలు సాగు చేసే రోజులు పోయాయి. కాలువల్లో పారుతున్న నీళ్లతో ఎంత పంట వస్తుందో ఖాయంగా అంచనా వేసే రోజులు వచ్చాయి. గతంలో ఇబ్బడి ముబ్బడిగా ఒక అంచనా లేని వ్యవసాయం చేసే రైతులు కాలం అయితేనే పంటలు చేతికి వస్తాయని నమ్మేవారు. ఇప్పుడు కాలువల నుంచి నీళ్లు వచ్చి చిట్ట చివరి గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో నీటి కళ తొణికిసలాడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రైతులు ఎప్పుడూ సాగు చేసేవే పండించకుండా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని ఈ సీజన్‌ నుంచి అమలులోకి తెచ్చింది. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న పంటలను సీజన్‌ వారీగా ప్రణాళికలు రూపొందించుకుని సాగు చేయాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంతోపాటు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో సాగు విధానాన్ని పూర్తిగా మార్చివేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వానకాలంలో ప్రధాన పంట వరి తర్వాత పత్తి సాగుకు పెద్ద పీట వేశారు. అందుకు తగినట్లుగానే రైతులు స్పందించి పత్తి సాగును గణనీయంగా పెంచుతున్నారు.

పత్తికి సాగుకు పెద్ద పీట 

పత్తి దీర్ఘకాలికంగా వచ్చే పంట. ఒక్క వాన కాలం సీజన్‌లోనే సాగు చేస్తారు. గతంలో వర్షాలపై ఆధారపడి దీనిని సాగు చేసే వారు. ఇప్పుడు కాలువల్లో కాళేశ్వరం నీళ్లు పారుతున్న నేపథ్యంలో బావులు, బోర్ల కింద భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి. వర్షాలు కురిస్తేనే పత్తి పండుతుందనే భావన నుంచి బయటపడిన రైతులు ప్రాజెక్టులను నమ్ముకుని పంటలు సాగు చేస్తున్నారు. వానకాలంలో మక్క సాగును పూర్తిగా తగ్గించి పత్తి సాగు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కరీంనగర్‌ జిల్లాలో 1,00,979 ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రణాళికలు వేశారు. ఈ జిల్లాలో ఇప్పటికే 65,959 ఎకరాల్లో సాగు చేశారు. సిరిసిల్లలో 1.30 లక్షల ఎకరాలకు ఇప్పటికే 96,580 ఎకరాల్లో, పెద్దపల్లి జిల్లాలో 81,172 ఎకరాలకు ఇప్పటి వరకు 64,523 ఎకరాల్లో, జగిత్యాల జిల్లాలో 38 వేల ఎకరాలకు 17,399 ఎకరాలు కలుపుకుని ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 2,44,461 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ నెల 15 వరకు పత్తి సాగు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొన్ని మండలాల్లో రైతులు వరి నాట్లు వేస్తున్నారు. చాలా చోట్ల వరినార్లు పోసుకుని పత్తి సాగుపైనే దృష్టి సారించారు. ప్రణాళికలో ఇప్పటికే 69.81 శాతం పత్తి సాగు పూర్తయ్యింది. ఈ నెల 15 వరకు ఈ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ సీజన్‌లో పత్తికే డిమాండ్‌

నియంత్రిత సాగు విధానంలో భాగంగా వానకాలం పత్తిని ప్రధాన పంటగా ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు తగినట్లుగానే రైతులు పత్తి సాగు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ పరిధిలోని కొందరు రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 2020-21 వానకాలం, యాసంగి పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర చూస్తే పత్తికి మంచి డిమాండ్‌ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పైగా తెలంగాణ వాతావరణం పత్తి సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇక్కడి పత్తి బేళ్లకు మంచి డిమాండ్‌ ఏర్పడుతోంది. గతేడాది పత్తి మధ్యరకం గింజకు క్వింటాలుకు రూ.5,255 కనీస మద్దతు ధర ఉండగా ఈ ఏడాది రూ.5,515కు పెంచారు. పొడవు గింజ పత్తికి గతేడాది రూ.5,550 కనీస మద్దతు ధర ఉండగా ఈ ఏడాది రూ.5,825కు పెంచారు. సీసీఐ ఎఫ్‌ఏక్యూ నిబంధనల ప్రకారం 8 శాతం కంటే తక్కువ తేమ ఉన్న పత్తికి మరింత డిమాండ్‌ పెరగవచ్చు. తేమ శాతం తగ్గడం, పింజ పొడవును బట్టి ఈ సీజన్‌లో రూ.6 వేలకు వ్యాపారులు కొనుగోలు చేసుకునే అవకాశాలు లేక పోలేదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పత్తి సాగును ఎక్కువగా ప్రోత్సహించింది. కేంద్రం పత్తికి కనీస మద్దతు ధర పెంచిన నేపథ్యంలో రైతులకు ఈ పంట లాభసాటిగా ఉంటుందని భావిస్తోంది. 

పది రోజుల్లో మరింత పెరిగే అవకాశం 

ఉమ్మడి జిల్లాలో పత్తి సాగుకు అనుకూలమైన వాతావరణం, కేంద్ర ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పత్తి సాగుకు ప్రాధాన్యత ఇచ్చింది. అందుకు అనుగుణంగానే రైతులు స్పందించారు. పెద్ద మొత్తంలో పత్తి సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో మక్కకు ప్రత్యామ్నాయంగానూ పత్తి సాగు పెరుగుతున్నదని భావించవచ్చు. వచ్చే పది రోజుల్లో పత్తి విత్తుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రోజు రోజుకూ పత్తి సాగు గణనీయంగా పెరుగుతోంది. ప్రణాళిక మేరకు సాగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పత్తిలో అంతర పంటగా కంది వేసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. బోనస్‌ పంటగా అందుతుంది. 

- వాసిరెడ్డి శ్రీధర్‌, కరీంనగర్‌ జిల్లా వ్యవసాయ అధికారి


logo