కొత్తపల్లి, అక్టోబర్ 8 : ఆచరణ సాధ్యం కాని అబద్దపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి ప్రజలను వంచించిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. మంగళవారం కొత్తపల్లి మండలం నాగులమల్యాలలో 2 కోట్లతో నాగులమల్యాల నుంచి నర్సింగాపూర్ వెళ్లే కట్ట దారి నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో రోడ్లను నిర్మించడంతోపాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. కమ్యూనిటీ హాళ్లు నిర్మించామని, ఇంకా ఏమైనా చివరి దశలో ఉంటే వాటి వివరాలు అందజేయాలని అధికారులకు సూచించారు. తన రాజకీయ జీవితంలో ఎకువ సమయం ప్రతిపక్షంలోనే ఉండి పోరాటాలు, ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తమ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ కాలేదని, రైతుబంధు ఇప్పటి వరకు అందించలేదని రైతులు ఎమ్మెల్యేకు ఏకరువుపెట్టారు. ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని గ్రామ పారిశుధ్య కార్మికులు వాపోయారు. 4వేల పెన్షన్ ఇవ్వడం లేదని పెన్షన్‌దారులు చెప్పారు. గతంలో మంత్రిగా ఉన్న సందర్భంలో ఆచంపల్లి దగ్గర వరద కాలువకు తూము ఏర్పాటు చేసి గ్రామాలకు సాగునీరు అందించిన ఘనత మీదేనంటూ ఎమ్మెల్యే గంగులను ప్రజలు కొనియాడారు. అంతకు ముందు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్‌గౌడ్, కరీంనగర్ మారెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్, మాజీ జిల్లా కో ఆప్షన్ సభ్యుడు సాబీర్ పాషా, వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మాజీ సర్పంచ్ నాయిని ప్రసాద్, మాజీ ఎంపీటీసీ కొమ్ము హేమలత, బావుపేట మాజీ ఎంపీటీసీ కమల మనోహర్, మారెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్ పాల్గొన్నారు.