రాజన్న సిరిసిల్ల, జూలై 6 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల/ సిరిసిల్లటౌన్ : తాతలు, తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఆ భూములకు చట్టపరంగా ఎలాంటి హక్కులూ లేవు. తమకు పట్టాలిచ్చి యజమానులను చేయాలంటూ సాగుదారులు చేసిన డిమాండ్ల పరిష్కారంపై సమైక్య సర్కారు నిర్లక్ష్యం చేసింది. అంతే కాకుండా, కేసులు పెట్టించి కోర్టుల చుట్టూ తిప్పింది. స్వరాష్ట్రంలో ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తండాలను సందర్శించినప్పుడు పోడు గోస తీర్చాలంటూ సాగు రైతులు గోడు వినిపించారు. అటవీ అధికారుల దాడులతో పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న రామన్న సానుకూలంగా స్పందించారు. అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.
పట్టాతో యజమానినయ్యా
పోడు భూమిని మేం 30 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నం. నేను నా కుటుంబసభ్యుమంతా దీనిపైనే అధారపడి బతుకుతున్నం. నాలుగెకురాల ముప్పై గుంటల భూమికి మంత్రి కేటీఆర్ సార్ చేతుల మీదుగా పట్టా అందుకున్నా. ఏండ్ల కాలంగా పడ్డ గోస తీరింది. ఇదే భూమిల పంట సాగు చేసుకునేటందుకు జంగ్లాత్ సార్లతో గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. మా బాధలను గుర్తించి సీఎం కేసీఆర్, కేటీఆర్ సార్లు పట్టాలు ఇచ్చిన్రు. ఇక భరోసాగా పంటలను సాగు చేసుకుంటం. తరతరాలుగా మా కుటుంబం ఈ భూమినే నమ్ముకుని బతుకేలా కేటీఆర్ సార్ మాకు ధైర్యం ఇచ్చిండు. సార్‌కు మేం మా తరాలు అంతా రుణపడి ఉంటయ్.
– బానోతు వినోద, ఎర్రగడ్డ తండా
రంది లేకుంట ఎవుసం చేసుకుంటం
పోడు చేసుకునే భూములకు పట్టాలు వస్తయని కలలో కూడా అనుకోలె. మా పెద్దలు ఎకరం 19 గుంటల భూమిల పంట పండించుకునేటోళ్లు. ఇయ్యాళ ఆ భూమికి పట్టా వచ్చింది. సీఎం కేసీఆర్ దేవుడిలా కరుణించిన్రు. ఇన్నేళ్ల తర్వాత ఫలితం దక్కింది. ఈ బుక్తోఅన్ని ఇబ్బందులు పోయినయ్. మాభూమిపై మాకు హక్కు ఇచ్చిన ముఖ్యమంత్రిని, మంత్రి కేటీఆర్‌ను మరిచిపోలేం. ఇప్పుడు భాజాప్తా భూమిల పంటలు వేసుకుంటం. ఎవరు ఏమాంటారనే భయం లేకుంటైంది. గతంల ఎప్పుడు పంట వేసుకుందామన్నా ఏదో ఒక లొల్లి ఉండేది. ఇప్పుడు ధైర్నంతో పంటలు వేసుకుంటం. రంది లేకుండా ఎవుసం చేసుకుంటం.
– కెలావత్ మీనా, వన్‌పల్లి
వీర్నపల్లి మండల గిరిజనులకే తొలిపట్టా
సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలం జవహర్లాల్తండా రైతులే తొలి పట్టా అందుకున్నారు. నాడు ఏ మండల పోడు రైతులకైతే హామీ ఇచ్చారో ఆ మండల రైతులకే మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ మొదటి పట్టా అందజేయడంతో పోడు రైతుల్లో ఆనందం వెల్లి విరిసింది. సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన పట్టాల పంపిణీలో భూక్య ధర్‌సింగ్, జార్పుల సుందీ, భూక్య సరోజకు మంత్రులు పట్టాలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1614 మంది పోడు రైతులకు 2859.34 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేశారు.
పండుగ లెక్క అనిపిస్తంది
ఏండ్ల సంది ఎదురుచూస్తున్న మాకు పోడు భూముల పట్టాలు వచ్చినంక కల నెరవేరింది. ఇన్నాళ్లూ భూమి మాదని కాగితాలు లేక ఎంతో రంది ఉండేది. ఎకరం భూమి మాకు పట్టా ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నది. అందరూ మాటలు చెప్పెటోళ్లే కానీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సార్లు మాత్రం మేం అనుకున్నదానికంటే ఎక్కువనే చేసిండ్రు. పట్టా తీసుకుంటే పండుగ లెక్క అనిపిస్తంది. నా ఇద్దరు కొడుకులకు ఉపాధి దొరికింది. కేసీఆర్ సారును మళ్లోసారి ముఖ్యమంత్రిని చేసి రుణం తీర్చుకుంటం. మంత్రి కేటీఆర్ సార్‌కు ధన్యవాదాలు.
– అజ్మీర లింబవ్వ, అజ్మీరతండా, వట్టిమల్ల
ముప్పై ఏండ్ల గోస తీరింది
పోడు చేసుకొని 30 ఏండ్లుగా సాగు చేసుకుంటూ బతుకుతున్నం. పంట వేసినప్పుడు అధికారులతో ఏటా ఇబ్బందులుండేవి. ఎంత బతిమిలాడినా పట్టించుకునేవారు కాదు. ఇయ్యాళ సీఎం కేసిఆర్ సార్ దయతో నేను సాగు చేసుకుంటున్న 35 గుంటల భూమికి పట్టా వచ్చింది. ఈ రోజుతో నేను ముప్పై ఏండ్లుగా పడ్డ కష్టాలు పోయినయ్. మాలాంటి గిరిజనుల కోసం పోడు పట్టాలు ఇచ్చిన కేసీఆర్ సార్‌కు , మంత్రి కేటీఆర్ సార్‌కు జీవిత కాలం రుణపడి ఉంటం. కుటుంబం అంతా ఎల్లకాలం బతుకుతామనే ధైర్యం వచ్చింది.
– భూక్యా సరోజన, వీర్నపల్లి
ఆనందంలో గిరిజనులు
ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆ రైతుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చింది. సర్కారు ఇచ్చిన పట్టాలు అందుకున్న గిరిజనులంతా ‘మాజమీ.. అమీన్’ అంటూ సంతోషపడ్డారు. వీర్నపల్లి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోనే అత్యధికంగా గిరిజనులుండగా, వీరందరికీ ఒకేసారి మంత్రులు పట్టాలివ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇన్నేళ్ల నుంచి గోస పడ్డమాకు తెలంగాణ సర్కారు అండగా నిలిచిందంటూ హర్షం వ్యక్తం చేశారు. సమావేశం తర్వాత పోడు రైతులంతా మంత్రి రామన్నతో సెల్ఫీ దిగేందుకు ముచ్చట పడ్డారు. చాలా మంది రైతులకు పట్టాలివ్వాల్సి ఉన్నందున సాధ్యం కాకపోవడంతో దూరం నుంచే రామన్నకు రెండు చేతులెత్తి దండం పెట్టుకున్నారు. పట్టాలివ్వడంతోపాటు ఈ వానకాలం పంటకు రైతుబంధు పైసలు కూడా బ్యాంకు ఖాతాల్లో వేస్తామని, పోడు రైతులందరికీ రైతు బీమా వర్తింప జేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పడంతో వారు సంబురపడ్డారు.
మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్
స్వరాష్ట్రంలో గిరిజన బిడ్డలకు ఎలాంటి కష్టాలు రాకూడదన్న ఉద్దేశంంతో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిప్పిస్తానని ఆనాడు ఇచ్చిన మాటను మంత్రి కేటీఆర్ నిలబెట్టుకున్నారు. ఆయన చొరవతో ఒక రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు, రాష్ట్రంలోని 1,50,224 మంది అడవి బిడ్డలను ప్రభుత్వం పట్టాభిషిక్తులను చేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 44.60 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి సీఎం కేసీఆర్ పోడు రైతుల గోడు తీర్చారు. పట్టాలు పంపిణీ చేసి గిరిజనులు, ఆదివాసీలకు ఆత్మబంధువయ్యారు. సాగుచేసుకుంటున్న భూములకు స్వరాష్ట్రంలో యజమానులైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమజీవితాలకు భరోసా ఇచ్చి అండగానిలిచిన కేటీఆర్ దేవుడంటూ కొనియాడుతున్నారు.
గిరిజనులకు న్యాయం
సీఎం కేసీఆర్‌తోనే గిరిజనులకు న్యాయం జరిగింది. మేం 25 ఏండ్ల నుంచి ఎకరం భూమిని నమ్ముకుని బతుకుతున్నం. గత 60 ఏండ్లలో ఏ ప్రభుత్వాలు చేయని పనిని సీఎం కేసీఆర్ సార్ తొమ్మిదేండ్లలో చేసి చూపిండు. మా గిరిజనులకు ఇది పండుగ లెక్క అనిపిస్తంది. పట్టాలు అందుకుంటే ఎంతో సంతోషంగ ఉన్నది. మా కుటుంబానికి భూమిని అప్పగించి భవిష్యత్తు తరాలకు తొవ్వచూపిండు . మంత్రి కేటీఆర్‌కు మేమంతా రుణపడి ఉంటం. ఇప్పుడు ధైర్యంగ పొలాలకు వెళ్లి పంటలు సాగు చేసుకుంటం. మంచి పంటలు సాగు చేసి సీఎం కేసీఆర్ గర్వపడేలా ఉంటం.
– భూక్యా ధర్‌సింగ్, జవహర్లాల్ నాయక్ తండా