Sultanabad | సుల్తానాబాద్ రూరల్, మార్చి 22 : ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈదురుగాళ్లతో కురిసిన వర్షానికి గ్రామానికి చెందిన సంబుల లచ్చయ్య అనే వ్యక్తికి చెందిన గొర్ల కోసం వేసిన రేకుల షెడ్డు కూలిపోయింది.
ఈ ఘటనలో 12 గొర్రెలు మృతి చెందాయి. దాదాపుగా 15 గొర్రెలకు గాయాలయ్యాయి. అక్కడే పక్కకు పడుకున్న లచ్చయ్య ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. నిరుపేద కుటుంబానికి చెందిన లచ్చయ్య గొర్రెలను పెంచుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవన సాగిస్తున్నాడు. అకాల వర్షం తో రేకుల షెడ్డు కూలి గొర్రెలు మృత్యువాత పడడంతో బాధితులు ఆందోళన చెందుతున్నాడు. ఎంతో కష్టపడి ఒక్కొక్కటిగా దాదాపు 80 గొర్రెల వరకు పెంపకం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లచ్చయ్యకు ఈ సంఘటన కోలుకోలేని విధంగా మారింది.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు రాజు బక్కయ్య కొమురయ్య రాజకుమార్ తదితరులు సంఘటన చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపుగా మూడు లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాధితులతో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే దాదాపుగా 20 ఎకరాల వరకు వరి పంట నేల వాలింది.