కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వచ్చిన ఓటర్ నమోదు దరఖాస్తుల్లో భారీగా తిరస్కరణకు గురయ్యాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా 48,440 అప్లికేషన్స్ వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యాయి. అందులో టీచర్లకు సంబంధించి 15.63 శాతం గ్రాడ్యుయేట్స్‌కు సంబంధించి 12.28 శాతం ఉండగా, ఈ రెండు కలిపి చూస్తే 12.53 శాతం దరఖాస్తులు ఉన్నాయి. తాజాగా వెల్లడించిన ముసాయిదా జాబితాతో ఈ విషయాలు వెలుగుచూడగా.. ఓటు హక్కు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశమిచ్చింది. రిజెక్టు అయిన వారితోపాటు కొత్తగా నమోదు చేసుకునే వారు, అలాగే మార్పులు చేర్పులు చేసుకునే వారు సైతం వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. మరింత మంది ఓటర్లను చేర్చేందుకు ఔత్సాహిక అభ్యర్థులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా, దరఖాస్తుదారులు మేల్కోకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదమున్నది.
కరీంనగర్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం వచ్చే మార్చితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఎలక్షన్లకు సిద్ధమైన ఎన్నికల సంఘం, ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి ఓటర్ నమోదుకు అవకాశమిచ్చింది. మొదటి విడుతలో సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6వరకు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దాంతో ఈ సారి పట్టభద్రులు, ఉపాధ్యాయు లు ఓటు హక్కు కోసం భారీగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నవంబర్ 6 నాటికి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 3,58,579 దరఖాస్తులు రాగా, అధికారులు ప్రతి దరఖాస్తునూ నిశితంగా పరిశీలించారు. అందులో 44,048 దరఖాస్తుల(12.28 శా తం)ను వివిధ కారణాలతో తిరస్కరించారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి నవంబర్ 6 నాటికి మొ త్తం దరఖాస్తులు 27,994 రాగా, పట్టభద్రుల మాదిరిగానే వడబోశారు. ఆ మేరకు 4,392 దరఖాస్తుల (15. 68శాతం)ను రిజెక్ట్ చేశారు. మొదటి విడుతలో భాగంగా మొత్తం 3,86,573 మంది పట్టభద్రులు, ఉపాధ్యాయు లు దరఖాస్తు చేసుకోగా, అందులో మొత్తం 48,440 దరఖాస్తులు(12.53) శాతం తిరస్కరించారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓటర్ ముసాయిదా జాబితాను ఈ నెల 23న విడుదల చేశారు. దీంతో వేల సంఖ్య లో దరఖాస్తులు రిజెక్టు అయిన విషయం వెలుగులోకి వచ్చింది.
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం రెండో సారి అవకాశమిచ్చింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 9వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. రిజెక్టు అయిన వారితోపాటు కొత్త వారు కూడా నమోదు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు కూడా చేసుకోవచ్చు. డిసెంబర్9 తర్వాత మళ్లీ అవకాశం ఉంటుందా.. లేదా..? అన్న విషయంలో స్పష్టత లేదు. కానీ, వచ్చే నెల 9వరకు వచ్చే దరఖాస్తులను పరిశీలించి, తుది జాబితాను 30న విడుదల చేస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఓటు హక్కు కోసం దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో అదే స్థాయిలో రిజెక్ట్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పట్టభద్రులు విషయాన్ని పక్కన పెడితే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి వచ్చిన అప్లికేషన్స్‌లో 15.68 శాతం తిరస్కరించడంపై సదరు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఉపాధ్యాయుల్లోనూ బల్క్ నమోదు వల్లే ఈ పరిణామం తలెత్తి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్సీ సీటుపై జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్న కొంత మంది నాయకులు, జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది నాయకులు మొదటి విడు త నమోదులోనే వీలైనంత ఎక్కువగా మందిని ఓటర్లుగా చేర్చడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కొందరైతే ఏ కంగా ఆపరేటర్లను పెట్టి నమోదు చేయించారు. మిస్డ్‌కాల్ ఇస్తే చాలు.. సంబంధిత ఓటర్ పూర్తి వివరాలు తెలుసుకొని మరీ ఎంట్రీ చేశారు. ఈ నేపథ్యంలో భారీగా దరఖాస్తులు రిజెక్టు కావడంతో సదరు అభ్యర్థులు మళ్లీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బల్క్‌గా నమోదు చేసినప్పుడు దొర్లిన తప్పులు, వాటి ద్వారా రిజెక్టు అయిన దరఖాస్తుదారుల వివరాలు సరిచూసుకుంటూ మళ్లీ ఓటరుగా నమోదు చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో మొదటిదఫా నమోదు చేసుకోని కొత్తవారిని గుర్తించి, వారి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నారు. అంటే క్షేత్రస్థాయిలో ఓటర్ నమోదు కోసం జరుగుతున్న ప్రయత్నాలు చూస్తే మరో 50 వేల వరకు అప్లికేషన్స్ వచ్చే అవకాశాలున్నాయని అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. కాగా, మొదటి విడుత దరఖాస్తున్న వారు ముసాయిదా జాబితాను ఒకసారి చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందులో పేరు లేకపోతే తిరిగి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో దరఖాస్తు చేసుకున్నాం కదా! అని కూర్చుంటే.. ఓటు కోల్పోయే ప్రమాదమున్నది. దరఖాస్తుదారుడు జాబితా చూసుకున్నప్పుడే పేరు ఉన్నదా.. లేదా..? అనే విషయం తెలుస్తుంది. అంతేకాదు, పరిశీలనలో ఏమైనా పొరపాట్లు ఉంటే కూడా ఫిర్యాదు చేసే అవకాశముంటుంది.