ఏ ఊరికి వెళ్లినా అవే బాధలు.. సొసైటీలు, ఆగ్రోసెంటర్ల వద్ద ఉదయం నుంచీ సాయంత్రం దాకా ఒకటే బారులు.. చెప్పుల లైన్లు. ఏ ఒక్క రైతును కదిలించినా ధారగా పారే కన్నీళ్లు. రోజుల కొద్ది పడిగాపులు పడ్డా ఒక్క బస్తా దొరకని దుర్భర పరిస్థితులు. ఇవన్నీ యూరియా కోసం నెల రోజులుగా రైతులు అనుభవిస్తున్న కష్టాలు.. నేటికీ తీరని వ్యథలుగానే మిగులుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు పట్టింపులేమి.. అధికారుల నిర్లక్ష్యంతో రోజురోజుకూ కొరత తీవ్రమవుతుండగా, రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సమైక్యం రాష్ట్రంలో అనుభవించిన దుస్థితిని కాంగ్రెస్ మళ్లీ తీసుకొచ్చిందని మండిపడుతున్నది. రైతులను గోస పెట్టడు ప్రభుత్వానికి మంచిదికాదని హితవు పలుకుతున్నది. సరిపడా అందించాలని డిమాండ్ చేస్తున్నది.
కోరుట్లపేటలో పరుగులు
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 3: ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో రైతులు ఆగమయ్యారు. మంగళవారం రాత్రి మహిళా సంఘం షాపునకు 220 బస్తాల యూరియా వచ్చిందని తెలిసి బుధవారం ఉదయాన్నే పరుగులు తీశారు. మొదట గ్రామపంచాయతీ వద్దకు దాదాపు 270 మంది చేరుకున్నారు. తీరా కొద్ది సేపటికి మరో చోట పంచుతున్నారని తెలియడంతో అక్కడికి పరుగులు పెట్టారు. అప్పటికే అక్కడ రైతులు క్యూలో ఉండగా, సిబ్బంది టోకెన్లు ఇచ్చారు. ఉదయం 9గంటల నుంచి ఒక్కొక్కరికి ఒక్కో బస్తా చొప్పున అందజేశారు. అయితే ఒక్కో బస్తాకు అదనంగా 30 చొప్పున 300 వసూలు చేశారని ఆరోపించారు. సుమారు 50 మందికి అందకపోవడంతో నిరాశ చెందారు. మరో రెండు రోజుల్లో లోడు వస్తుందని అధికారులు హామీ ఇచ్చి, యూరియా రాని రైతులకు టోకెన్లు రాసిచ్చారు.
కాల్వశ్రీరాంపూర్, సెప్టెంబర్ 3: కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం సహకార సంఘానికి యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు బుధవారం తెల్లవారుజామున 4గంటల నుంచే పడిగాపులు గాశారు. మంగళవారం అర్ధరాత్రి 273 బ్యాగులతో లారీ రాగా, విషయం తెలిసి ఒక్కొక్కరుగా తరలివచ్చారు. ఉదయం వరకు 600 మంది క్యూలో నిల్చున్నారు. పోలీస్ పహారా మధ్యన ఉదయం 7.30 గంటల నుంచి పంపిణీ ప్రారంభించారు. ఒక్కొక్కరికీ ఒక్కో బ్యాగు చొప్పున అందజేశారు.
అయితే బస్తాలు దొరకక క్యూలో ఉన్న మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే సుమారు 350 మంది రైతులు యూరియా అందక అసహనం వ్యక్తం చేశారు. పొట్టదశలో ఉన్న పొలానికి ఇంత వరకు యూరియా వేయలేదని, పరిస్థితి ఇలాగే ఉంటే పంట చేతికిరాకుండా పోతుందని ఆవేదన చెందారు. ‘యూరియా ఇస్తారా.. లేదా..? యూరియా ఇవ్వకుంటే ఇంత పురుగుల మందు ఇవ్వండి. తాగి చస్తాం’ అంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు.
చందుర్తి, సెప్టెంబర్ 3: చందుర్తి మండల రైతులు ఇరవై రోజులుగా నిరీక్షించినా యూరియా దొరకలేదు. పోయిన నెల 12న 370 మందికి టోకెన్లు ఇస్తే.. బుధవారం వంద మందికి మించి ఇవ్వలేదు. సహకార సంఘానికి యూరియా వచ్చిందని టోకెన్లు తీసుకున్న దాదాపు 200 మందికిపైగా రైతులు తరలివస్తే.. 210 బ్యాగులే ఉండడంతో అసహనం వ్యక్తమైంది. తీరా ఎకరానికి ఒకటి చొప్పున గరిష్ఠంగా మూడు బ్యాగుల వరకు వంద మందికి అందజేయగా, మిగతా వంద మందికిపైగా రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
యూరియా రానప్పుడు టోకెన్లు ఎందుకిచ్చారంటూ సిబ్బందిని ప్రశ్నించారు. అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరగ్గా, పోలీసులు కలగజేసుకొని నివారించే ప్రయత్నం చేశారు. మళ్లీ లోడ్ వస్తుందని, అప్పులు అందరికీ ఇస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. అలాగే మర్రిగడ్డ ఆగ్రోస్ కేంద్రానికి 330 బ్యాగులు రాగా, 170 మంది ఉదయం నుంచే బారులు తీరారు. పోలీస్ పహారా మధ్యన ఒక్కో రైతుకు రెండు చొప్పున అందజేశారు.
ధర్మారం, సెప్టెంబర్ 3: ధర్మారం మండలంలోని రామయ్యపల్లి డీసీఎంఎస్ కేంద్రానికి 270 యూరియా బస్తాలు రాగా, రైతులు తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఐదు గ్రామాల నుంచి దాదాపు 500 మంది ఆధార్ కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్ ప్రతులను క్యూలో పెట్టి వేచి ఉన్నారు. 270 బస్తాల యూరియా ఉండగా, అవి సరిపోవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఒక్కొక్కరికి ఒక్క బస్తా అందజేశారు. దాదాపు 200 మందికిపైగా నిరాశతో వెనుదిరిగారు.
ముత్తారం, సెప్టెంబర్ 3 : ముత్తారం సింగిల్ విండో కార్యాలయం వద్ద రైతులు ఉదయం 6గంటల నుంచే బారులు తీరారు. సుమారు 300 మంది పడిగాపులు గాశారు. నిల్చుండే ఓపిక లేక క్యూలో చెప్పులు పెట్టారు. సిబ్బంది ఉదయం 9.30 గంటలకు పంపిణీ ప్రారంభించి, సాయంత్రం 5గంటల వరకు అందజేశారు. ఎకరాలను బట్టి ఒక్కో రైతుకు రెండు నుంచి మూడు వరకు మొత్తం 450 బస్తాలు పంపిణీ చేశారు. అయితే ఎకరాకు ఒక్కో బస్తా చొప్పున ఇవ్వాలని అడిగినా అధికారులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు సమారు 70 మందికి యూరియా దొరకపోవడంతో నిరాశతో వెనుదిరిగి పోయారు.