పల్లె ప్రకృతి వనాలకు రక్షణ లేకుండా పోతున్నదా..? కబ్జా చేసేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారా..? ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసి ఏళ్ల తరబడి పంచాయతీ ఆధీనంలో ఉన్న భూములను ఇప్పుడు ‘తమవే’ అంటున్నారా..? నిగ్గుతేల్చాల్సిన అధికారయంత్రాంగం చోద్యం చూస్తున్నదా..? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. వేములవాడ అర్బన్ మండలంలోని గుర్రంవానిపల్లె ప్రకృతివనమే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. 3.77 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ పల్లె ప్రకృతి వనం ‘తమదే’ అంటూ కొంత మంది మోఖాపై స్వాధీనం చేసుకుంటున్నా.. అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ‘అయ్యా.. మా పల్లె ప్రకృతి వనాన్ని కాపాడండి’ అంటూ ఎంపీడీవో నుంచి కలెక్టర్ వరకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసి నెల రోజులు దాటినా సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిగ్గు తేల్చాల్సిన అధికారులు నిద్ర పోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలను బహిర్గతం చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్ మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపునకు గురైన గ్రామాల్లో గుర్రం వానిపల్లె ఒకటి.. డ్యాం కట్టను ఆనుకొని ఉండడం వల్ల ముందుగా ఈ పల్లెను ఖాళీ చేయించి, వేములవాడ అర్బన్ మండల పరిధిలోని మారుపాక శివారులో వీరికి ఆనాటి ప్రభుత్వం పునరాసం కల్పించింది. సర్వేనంబర్ 360, 361 పరిధిలో ఉన్న 26.03 ఎకరాలను 2009లో పునరావాసం కోసం కేటాయించింది. అందులో దాదాపు 248 ప్లాట్స్ కేటాయింపు చేసింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కాగా, గుర్రంవానిపల్లె కూడా పంచాయతీగా ఏర్పాటైంది.
ఈ పునరావాస గ్రామానికి సంబంధించిన భూమి కొలతలు అన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే భూమి కొలతలు, రికార్డుల అధికారులు సర్వే చేసి హద్దులు పెట్టి ఇచ్చారు. ఆ మేరకు ప్లాట్స్ కేటాయించారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో భాగంగా గుర్రంవాని పల్లెలోనూ 2019-20లో పంచాయతీ తీర్మానం మేరకు ఎకరానికిపైగా స్థలంలో వనం ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 3.77 లక్షలతో ఇంకుడు గుంతలు, మొక్కల పెంపకంతోపాటు సిమెంట్‌రోడ్డు నిర్మించారు. కంచె నిర్మాణానికి డబ్బులు లేకపోవడంతో అప్పట్లో చేపట్టలేదు. పంచాయతీ వాళ్లే దీని నిర్వహణ చూసుకుంటున్నారు. ఇదంతా గ్రామస్తుల కండ్ల ముందే ఏళ్ల తరబడిగా జరుగుతున్నది. కానీ, తాజాగా పరిస్థితులు తారుమారు అవుతున్న తీరు చూసి గ్రామస్తులు తట్టుకోలేకపోతున్నారు.
2019-20 నుంచి పల్లె ప్రకృతి వనంగా ఉన్న స్థలాన్ని ప్రస్తుతం కొంత మంది తమదేనంటూ స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా అందులో ఖనీలు పాతారు. ప్రస్తుతం ఇక్కడ గుంట స్థలం విలువ దాదాపు 15 లక్షల వరకు ఉన్నది. కొంచెం అటీటు చూసినా పల్లె ప్రకృతివనం భూమి విలువ దాదాపు 5 కోట్లవరకు ఉంటుందని అంచనా. ఇదే శివారులోని 366 సర్వేనంబర్‌లో స్థలాన్ని కొనుగోలు చేసిన ఓ వ్యక్తి.. ఇప్పుడు ప్రకృతి పల్లె వనం స్థలం కూడా తాను కొనుగోలు చేసిన స్థలం పరిధిలోకి వస్తుందని, అందుకే ఆ స్థలం స్వాధీనం చేసుకుంటున్నాని చెప్పడమేకాకుండా అందుకు సంబంధించిన పనులు మొదలు పెట్టారు. దీనికి ఆయన 2025 జనవరిలో డీఐ బాల చందర్‌తో చేయించిన సర్వేను ఆధారంగా చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఆ సర్వే ప్రకారం ప్రకృతివనం స్థలం తమకే చెందుతుందని, అందుకే స్వాధీనం చేసకుంటున్నామని ఆయన వాదన. నిజానికి ఈ స్థలం తమ గ్రామానికి చెందిందని గ్రామస్తుల వాదన. 2009లో తమకు పునరావాసం స్థలం కేటాయించి హద్దులు నిర్ణయించడమే కాకుండా.. ఇదే స్థలంలో 2019-20లో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి పంచాయతీ ఆధీనంలో నిర్వహిస్తున్నామని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. పంచాయతీ ఆధీనంలో ఉన్న స్థలం ఇప్పుడు ప్రైవేటుపరం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఈ స్థలం విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది కాంగ్రెస్ నాయకులు వెనకుండి కథ నడిపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిశితంగా చూస్తే అందులోని అనేక అంశాలు పలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2009లో భూమి కొలతల శాఖా ఉన్నతాధికారులు ఇచ్చిన సర్వే, మోఖా ఆధారంగా సదరు భూమిలోనే 2019-20లో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. ఇప్పుడు డీఐ బాలచందర్ సర్వే ప్రకారం పల్లె ప్రకృతివనం స్థలం తమ పరిధిలోకి వస్తుందని స్వాధీనం చేసుకునే వ్యక్తులు చెబుతున్నారు. అందులో ఏ అధికారి కొలిచింది నిజమో తేల్చాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైనే ఉన్నది. అలాగే పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేసి.. ఆ పనులకు 3.77 లక్షల పేమెంట్ కూడా జరిగింది.
ఇది ప్రైవేటు భూమే అయితే సీసీ రోడ్డు నిర్మించిన సమయంలో గానీ, లేదా మొక్కలు పెడుతున్న సమయంలో గానీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, భూమి కొలతల విభాగానికి చెందిన ఉన్నతాధికారి కొలిచిన తర్వాత తిరిగి ఆ భూమిపై ఏమైనా వివాదాలు వస్తే.. ఆ పైస్థాయి అధికారి మాత్రమే కొలువాలి. కానీ, ఇక్కడ డిప్యూటీ ఇన్స్పెక్టర్ వేములవాడ ఆయన కొలిచారు. ఇలా చూసినా ఇది పూర్తిగా నిబంధనల విరుద్ధంగా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పల్లె ప్రకృతి వనాన్ని కాపాడాలంటూ.. గ్రామస్తులు చాలా మంది ఎంపీడీవో మొదలు కలెక్టర్ వరకు ఈ యేడాది ఏప్రిల్ 16, 17 తేదీల్లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులు వెళ్లి నెల రోజులు దాటుతున్నా ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీనికి కారణం కొంత మంది హస్తం పార్టీ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా పల్లెప్రకృతి వనం పేరిట అభివృద్ధి చేసిన స్థలాలకే రక్షణ లేకుండా పోతే.. ఇక మిగిలిన ప్రైవేటు స్థలాలకు రక్షణ ఎలా ఉంటుందన్న ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో నిజానిజాలను నిగ్గు తేల్చి పల్లె ప్రకృతి వనంను కాపాడే అంశంపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించాలన్న డిమాండ్ వస్తున్నది. ఈ విషయంపై గ్రామ కార్యదర్శి శ్రీవాణిని ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ ద్వారా సంప్రదించగా.. ఈ విషయంలో ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. అలాగే ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.
పల్లెప్రకృతి వనాన్ని కాపాడాలని ఎంపీడీవో మొదలు కలెక్టర్ వరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినం. 2009 నుంచి పంచాయతీల స్వాధీనంలో ఉన్న స్థలం ఇప్పుడు ప్రైవేటు ఎలా అవుతుందని ప్రశ్నిస్తే ఏ అధికారి సమాధానం చెప్పడం లేదు. నిజంగానే అది ప్రైవేటు భూమి అయి ఉంటే.. పంచాయతీ నిధుల ద్వారా అభివృద్ధి చేసినప్పుడే అభ్యంతరం తెలుపాలి. కానీ, ఎవరూ చెప్పలేదు. అలాగే ఉన్నతాధికారులు కొలిచిన భూమిలో ఆ స్థాయి కంటే తక్కువ అధికారి ఎలా కొలుస్తారు? కొలిస్తే పంచాయతీకి ముందుగా నోటీసు ఇవ్వాలి. కానీ, సదరు అధికారి ఆ పనిచేయలేదు. మొత్తంగా ఈ భూమి కబ్జాకు గురవుతున్నట్టు మాకు అర్థమవుతున్నది. వెంటనే ఉన్నతాకారులు జోక్యం చేసుకొని.. తమ గ్రామ పంచాయతీ భూమి తమ పంచాయతీకి దక్కేలా చర్యలు తీసుకోవాలి. లేదా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అధికారులు స్పందించకపోతే.. న్యాయ పోరాటం చేస్తాం. ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి భూమిని కాపాడాలి.
– నాగారం బాలరాజు, తాజా మాజీ ఉపసర్పంచ్ (గుర్రంవాని పల్లె)