వీణవంక, అక్టోబర్12: దళితులపై ఆరాచకాలు, అకృత్యాలకు పాల్పడుతున్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం స్పష్టం చేశారు. వీణవంకలో అంబేద్కర్ సంఘం నాయకుడు తాండ్ర శంకర్ అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ ఉప పోరు తెలంగాణ దళిత ప్రజలకు.. బీజేపీకి మధ్య జరుగుతున్న యుద్ధంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో కులం పేరుతో దూషించి 6 వేల మంది దళిత యువకులను హత్యచేశారని, 4200 మంది మహిళలు, బాలికలను పొట్టనపెట్టుకున్నారని, రాజస్థాన్ లో 500 మంది దళిత మహిళలను అవమానపరించింది వాస్తవం కాదా..? బండి సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. ఇంకా ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో దళితులకు రిజర్వేషన్లు ఎక్కడ అమలవుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. రిజర్వేషన్లు తొలగించేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
యేటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ, ఏడేండ్లు పూర్తయినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, ఇది దేశ ప్రజలను మోసం చేసినట్లు కాదా..? అని ప్రశ్నించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా యూపీలో నిరసన తెలుపుతున్న రైతులను కార్లతో తొక్కించి చంపిందని, అలాంటి పార్టీకి ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీ జనాభా లెక్కలు ఎందుకు చెప్తలేరని ప్రశ్నించారు. బండి నోటి నుంచి పచ్చి అబద్ధాలు తప్ప వేరే మాటలు రావని, సీఎం కేసీఆర్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. దేశంలో దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ఒక్క పథకమైనా ప్రవేశ పెట్టారో చెప్పాలని, దళితుల కోసం ఏం చేయని బీజేపీ ఓట్లు అడగడానికి రావొద్దని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ వెంటే దళిత, గిరిజనులు ఉంటారని, టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఇక్కడ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి సురేందర్ సన్ని, కొమ్ము తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి బత్తుల పాండు, జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్, మండల కన్వీనర్ రాజయ్య, నాయకులు తిరుపతి, రవి, రాము, చంద్రశేఖర్, మల్లేశ్, అనిల్ ఉన్నారు.