మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 11 : గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ మాట్లాడుతూ గ్రూప్-1 పరీక్ష కోసం 28 కేంద్రాలు కేటాయించారన్నారు. ఒక్క కోటిలోని ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన రెండు సెంటర్లలో రాసిన అభ్యర్థుల్లో 71 మంది ఎంపికయ్యారని, మిగిలిన 26 సెంటర్లలో రాసిన వారిలో 139 మంది ఎంపికయ్యారని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు.
తెలుగులో 8694 మంది పరీక్ష రాస్తే కేవలం 56 మంది మాత్రమే ఎంపికయ్యారని, అదే ఇంగ్లిష్‌లో 12381 మంది పరీక్ష రాస్తే 508 మంది ఎంపికయ్యారని, దీనివల్ల తెలుగు మీడియం చదివిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు. అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారి మార్కులు తగ్గాయని పేర్కొన్నారు. ఎంతో శ్రమకోర్చి, అహర్నిషలు కష్టపడి చదివి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చేస్తున్న నిరుద్యోగ యువత విషయంలో టీజీపీఎస్సీ అనుసరించిన తీరు దారుణమని, ఎంతోమందిని మనోవేదనకు గురి చేసిన సర్వీస్ కమిషన్ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆసంపల్లి సంపత్, ఎండీ ముస్తాఫా, బెల్లం అరుణ్, సీపెల్లి సాగర్, ఆడెపు అరుణ్, ఎండీ నాయబ్, బుర్రి రమేశ్‌గౌడ్, దాసరి నవీన్, సీహెచ్ రమేశ్, రామిడి లక్ష్మీకాంత్, చంద్రకిరణ్, బాపునాయక్, రాజుయాదవ్, ప్రసాద్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.