న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని విడుదల చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న క్రమంలో, రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని తనపై సామాజిక మాధ్యమంలో దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంప్రదాయ ఇంధనంలో 20 శాతం ఇథనాల్‌ను కలిపి ఈ20 పెట్రోల్‌ను అమ్మడంపై సామాజిక మాధ్యమంలో అతిశయోక్తి ప్రచారం చేస్తూ ఆందోళన వ్యక్తమవుతున్నదన్నారు.
ఈ ఇంధనం సురక్షితమైనదని నియంత్రణ సంస్థలు, వాహన తయారీదారులు ఇద్దరూ దీనికి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అలాగే ఆటోమోటివ్ రిసెర్చ్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), సుప్రీం కోర్టు సైతం ఈ20 కార్యక్రమంపై స్పష్టత ఇచ్చాయన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమంలో రాజకీయంగా విష ప్రచారం జరుగుతున్నదని, ఇది పెయిడ్ ప్రచారమని, కాబట్టి దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదని అన్నారు. ఇథనాల్ మిశ్రమానికి అనుకూలంగా నిర్మించనందున ఈ20 ఇంధనాన్ని వాడిన పలు పాత వాహనాలు పాడైపోతున్నాయని పలువురు వాహనదారులు దేశ వ్యాప్తంగా ఆరోపిస్తున్నా గడ్కరీ వాటిని పట్టించుకోవడం లేదు.