Publicize National Family Scheme | కోల్ సిటీ, సెప్టెంబర్ 11: కుటుంబ యజమాని మరణిస్తే రూ.20వేల ఆర్థిక సహాయం వర్తించే కేంద్ర ప్రభుత్వ జాతీయ కుటుంబ లబ్ధి పథకంపై రామగుండం కార్పొరేషన్ ద్వారా ప్రచారం చేపట్టాలని, అందుకు బల్దియాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ కోరారు. ఈ మేరకు నగర పాలక సంస్థ కార్యాలయంలో గురువారం అదనపు కలెక్టర్, కమిషనర్ జే. అరుణ శ్రీని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఎంతో మంది నిరుపేదలు దారిద్య్రరేఖకు దిగువన ఉండి తినడానికి తిండి లేక, బట్టకు లేక సరియైన ఇల్లు లేక శ్రమను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని, అలాంటి కుటుంబంలో యజమాని ఏదైనా ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబంకు బాసటగా తక్షణ సహాయార్థం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం గురించి ఎక్కడ కూడా ప్రచారం లేకపోవడంతో చాలా మంది నష్టపోతున్నారని విజ్ఞప్తి చేశారు. దీంతో సెర్ఫ్ లో ఇప్పటికే రూ.60 కోట్లు నిధులు మూలుగుతున్నాయని తెలిపారు. ఈ పథకం కింద ఏటా రాష్ట్రంలో 7794 మందికి ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందన్నారు.
మండల, పట్టణ పరిధిలో అవగాహన లేక అర్హులైన వారు చాలా మంది ప్రయోజనం పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఈ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మున్సిపల్, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలనీ, మున్సిపల్ ద్వారా ఇచ్చే ఎన్ఐసీ సర్టిఫికెట్ బాధితులను ఇబ్బంది పెట్టకుండా మెప్మా సిబ్బంది ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు రేణికుంట్ల నరేంద్ర, గుండ్ల మల్లికార్జున్, శ్రీధర్ తదితరులు ఉన్నారు.