‘నాలో చాలా మార్పు వచ్చింది. నేను మునుపటి సమంతను కాదు. ఈ సమంత పరిపూర్ణురాలు. ఆ సమంత హాఫ్ నాలెడ్జ్.’ అంటున్నారు సమంత రూత్ ప్రభు. తనలో వచ్చిన మార్పు గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సమంత. కెరీర్ ప్రారంభంలో చాలా ఇమ్మెచ్యూర్గా ఉండేదాన్ని. అప్పట్లో ఏడాదికి అయిదారు సినిమాలు చేసేదాన్ని. బ్లాక్‌బస్టర్స్‌లో నటించాలని ఉవ్విళ్లూరేదాన్ని. టాప్ 10 జాబితాలో అగ్రపథంలో ఉండాలని ఆశించేదాన్ని. శుక్రవారం వస్తే ఏదో తెలీని ఆందోళన. నా సినిమా లేకపోయినా టెన్షన్. నా స్థానాన్ని పక్క వాళ్లు భర్తీ చేస్తారేమోననే భయం.
బాక్సాఫీస్ నంబర్ల క్యాలిక్యులేషన్స్ వేసుకుంటూ ఉండేదాన్ని. ఆత్మగౌరవం అనేది ఆ నంబర్లపైనే ఉందనుకునేదాన్ని. ఇప్పుడు టాప్ 10 జాబితాలో నేను లేను. రెండేళ్లుగా నా సినిమాలే లేవు. ఇప్పుడు నా దగ్గర వెయ్యికోట్ల సినిమాలు అసలే లేవు. కానీ నాకెలాంటి టెన్షన్ లేదు. కారణం నిజం గ్రహించాను. ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ రోజు నీది అయ్యింది, రేపు ఎవరిదో. దానికి బాధపడకూడదని నిశ్చయించుకున్నాను.’ అని తెలిపారు సమంత. ప్రస్తుతం ఆమె దర్శకధ్వయం రాజ్, డీకె దర్శకత్వంలో ‘రక్తబ్రహ్మాండ్’లో నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఇది రూపొందుతున్నది.