భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, గ్యాస్ సరఫరా పూర్తిగా సాధారణంగా కొనసాగుతున్నదని, వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి పౌర సరఫరాలు, రెవెన్యూ, విద్య, వైద్య, ఆరోగ్య, పోలీస్‌శాఖలు, వివిధ సంక్షేమ గురుకులాల అధికారులు, ఎల్పీజీ సేల్స్ అధికారులు, జిల్లాలోని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల యజమానులతో గ్యాస్ సరఫరాపై సమీక్షించారు.
జిల్లాలో గృహ వినియోగదారులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతోందని, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు వంటి అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల అత్యవసర సేవల కోసం గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండాలన్నారు. ప్రస్తుతం 26 గ్యాస్ పంపిణీ కేంద్రాలు ఉండగా అందులో హెచ్‌పీసీఎల్ 14, బీపీసీఎల్ 5, ఐవోసీఎల్ 7 ఉన్నాయని, మొత్తం 4,69,075 గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు.
వాటిలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 2,41,175, డబుల్ సిలిండర్ కనెక్షన్లు 98,868, దీపం కనెక్షన్లు 53,405, సీఎస్ఆర్ కనెక్షన్లు 2645, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కనెక్షన్లు 73,162 ఉన్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ రీఫిల్ బుకింగ్‌కు 45రోజుల వ్యవధి ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 25రోజుల వ్యవధి అనంతరం మాత్రమే రీఫిల్ బుకింగ్‌కు అవకాశం ఉంటుందని చెప్పారు. ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ గ్యాస్ సరఫరా ప్రక్రియ ప్రజలకు అంతరాయం లేకుండా కొనసాగేందుకు పోలీస్‌శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని తెలిపారు.
ప్రతి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల రవాణా సమయంలో జాగ్రత్తలు పాటించాలని, రోజువారీ గ్యాస్ సిలిండర్ల స్టాక్ రిజిస్టర్‌ను కచ్చితంగా నిర్వహించాలన్నారు. గ్యాస్ గోదాముల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలుచేయాలని, అధికారులు తనిఖీల సమయంలో ఎవరైనా అడ్డంకులు కలిగించినా లేదా దాడులకు ప్రయత్నించినా వారిపై కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్‌కుమార్, సీపీవో సంజీవరావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీలత పాల్గొన్నారు.