Mutyampet sugar factory | మెట్పల్లి, సెప్టెంబర్ 11: ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీని వెంటనే పునరుద్ధరించాలని అఖిల పక్షాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం గురువారం మెట్పల్లి పట్టణ శివారులోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ తులా గంగవ్వ ట్రస్ట్ చైర్మన్ తులా రాజేందర్ కుమార్, తెలంగాణ జన సమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కంతి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల పక్ష నాయకులు, చెరకు రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ఏకైక వ్యవసాయాధారిత పరిశ్రమ చక్కెర ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నాయకులు అభిప్రాయ పడ్డారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి ఏడాదిన్నర గడిచిన ఇంత వరకు ఎలాంటి పురోగతి లేదని మరి కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎన్నికల్లో చెరకు రైతులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చి చక్కెర ఫ్యాక్టరీకి పూర్వవైభవం తేవాలని పలువురు డిమాండ్ చేశారు. అదే విధంగా ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం చేపట్టాల్సిన కార్యచరణకు సంబంధించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం తెలిపారు.
ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో కనీసం 15 వేల ఎకరాల విస్తీర్ణంలో చెరకును నాటాలని, అందుకు ప్రభుత్వం తరపున ఫ్యాక్టరీ పునరుద్ధరణపై రైతులకు నమ్మకం కల్పించాలని తీర్మానించారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రి శ్రీధర్ బాబు కమిటీని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, స్థానిక నియోజకవర్గం అధికార పార్టీ నాయకుల ద్వారా త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వచ్చే సీజన్ లోపు ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులు ప్రారంభించేందుకు వినతి పత్రం అందజేయాలని తీర్మానించారు.
అదే విధంగా ఫ్యాక్టరీ పరిధిలోని అన్ని గ్రామాల్లో రైతలను కలిసి చెరకు పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు అవగాహన కల్పించడంతో పాటు చెరకు రైతులతో సంఘాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. జిల్లాలోన ఏకైనా వ్యవసాయాధారిత పరిశ్రమ అయిన ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఈ ప్రాంత అభివృద్ధిలో ఎంతో కీలకంగా మారుతుందని పలువురు నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో చెరకు ఉత్పత్తిదారుల సంఘం నాయకులు మామిడి నారాయణరెడ్డి, గోరుమంతుల ప్రవీణ్, చెన్నమనేని శ్రీనివాస్ రావు, బీఆర్ఎస్ నాయకులు దారిశెట్టి రాజేశ్, మారు సాయిరెడ్డి, సీపీఐ జిల్లా, నాయకులు చెన్నవిశ్వనాథం, సమాజ్‌వాది పార్టీ నాయకులు ముజాహిద్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు చింత భూమేశ్వర్, టీజేఎస్ జిల్లా కార్యదర్శి చింతకుంట శంకర్, గుయ్య సాయికృష్ణ, యాదవ్, లింబారెడ్డి, ఎలిసే పాపన్న తదితరులు పాల్గొన్నారు.