ఇంఫాల్, సెప్టెంబర్ 11: ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన వేళ ఆ రాష్ట్ర బీజేపీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ 43మందికి పైగా ఆ రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం సామూహిక రాజీనామాలకు దిగారు. ఉఖ్రుల్ జిల్లా ఫుంగ్యార్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటం సంచలనం రేపింది.
ప్రధాని మోదీ మణిపూర్ పర్యటనకు రెండు రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఫుంగ్యార్ మండల్ బీజేపీ అధ్యక్షుడు, మహిళా, యువ, కిసాన్ మోర్చా నాయకులు, 53 మంది బూత్‌స్థాయి అధ్యక్షులు రాజీనామా చేసినవారిలో ఉన్నారు.