న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి చెందిన ఒక విభాగం తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే రాజ్యాంగ పరిరక్షకురాలిగా సుప్రీంకోర్టు చేష్టలుడిగి నిస్సహాయంగా ఎలా చూస్తూ కూర్చోగలదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపడానికి గవర్నర్లు, రాష్ట్రపతికి కోర్టు గడువు విధించగలదా అన్న రాజ్యాంగపరమైన ప్రశ్నలు లేవనెత్తుతూ రాష్ట్రపతి చేసిన నివేదనపై విచారణ జరుపుతున్న ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసింది.
‘ప్రజాస్వామ్య విభాగాలలో ఒకటి తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే రాజ్యాంగ పరిరక్షకురాలిగా కోర్టు చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవాలా?’ అని సొలిసిటర్ జనరల్‌ను సీజేఐ ప్రశ్నించారు.