Lamborghini accident : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివమ్ తన లంబోర్గిని కారును నిర్లక్ష్యంగా నడిపి ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటానికి కారణమయ్యాడు. గత ఆదివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ లంబోర్గిని కారు ప్రమాదంతో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని కేకే మిశ్రా చెబుతున్నాడు. ప్రమాదంలో తన కుమారుని పాత్ర లేదని అంటున్నారు. ప్రమాదం సమయంలో తన కుమారుడు కారులోనే లేడని, ఆస్పత్రిలో ఉన్నాడని మీడియాకు తెలిపారు.
కారు ప్రమాదం జరగడానికి ముందే తన కుమారుడు శివమ్ తల తిరగుతోందని చెప్పి స్పృహ తప్పి పడిపోయాడని, దాంతో తన బౌన్సర్లలో ఒకరు కారు అద్దాలు పగులగొట్టి అతన్ని బయటకి తీసుకొచ్చారని కేకే మిశ్రా చెప్పారు. అనంతరం శివమ్‌ను ఇంటికి తీసుకొచ్చారని, అక్కడ నుంచి తాము ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. ఆ తర్వాత కారును తీసుకురావడానికి ఒక వ్యక్తిని అద్దెకు తీసుకున్నామని, అతని పేరు మోహన్ అని తెలిపారు. కారు కండిషన్ సరిగా లేకపోవడంతోనే ప్రమాదం బారిన పడిందని చెప్పారు.
ఏదేమైనా తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని, అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని మిశ్రా అన్నారు. తమను విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతామని చెప్పారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. కాగా పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివమ్ ఆదివారం మద్యం మత్తులో లంబోర్గిని (DL 8CBC 4018) కారును వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యారని వార్తలు వచ్చాయి. మద్యం మత్తులో హైస్పీడ్‌లో మొదట ఓ ఆటోను ఢీకొట్టిన కారు దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడింది.
అనంతరం రోడ్డు వెంట పాదచారులు, వాహనాల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో ప్రమాదం జరిగినప్పుడు తన కుమారుడు కారులో లేనేలేడని కేకే మిశ్రా చెప్పడం గమనార్హం.