సంగారెడ్డి, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంద్రాగస్టు రోజున సంగారెడ్డి జిల్లా వేదికగా పచ్చి అబద్ధాలు వల్లెవేశారు. సంగారెడ్డిలోని స్టేడియం గ్రౌండ్లో శనివారం ఏర్పాటుచేసిన బహిరంగసభలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగమంతా స్వోత్కర్ష, పరనిందలా సాగింది. తన పాలన బాగున్నదని గొప్పలు చెప్పుకుంటూనే కేసీఆర్, బీఆర్ఎస్పైనా అసత్య ఆరోపణలకు దిగారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు నిజాలు మాట్లాడటంతోపాటు ఆ జిల్లా ప్రజల సమస్యలు, నిధుల మంజూరుపై మాట్లాడాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలే మాట్లాడటంపై ప్రజల్లో నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ప్రసంగం తీరు, ఆడిన అబద్ధాలను జీర్ణించుకోని ప్రజలు ఆయన ప్రసంగం పూర్తిగా వినకుండానే ఇండ్లకు తిరుగుముఖం పట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో.. ‘రైతుబంధు ఆపలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కంటే రూ.2 వేలు పెంచి ఎకరాకు రూ.12వేల చొప్పున ఇస్తున్నానంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధుపై సీలింగ్ ఉండాలని చెప్పడంతోపాటు ఆ మేరకు అమలు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలో భూవిస్తీర్ణంతో సంబంధంలేకుండా రైతులందరి ఖాతాల్లో రైతుబంధు నగదును జమ చేశారు. కేసీఆర్ ఏటా రైతుల ఖాతాల్లో రూ.14 వేల నుంచి రూ.15వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. రేవంత్‌రెడ్డి మాత్రం 5 నుంచి 7 ఎకరాల్లోపు రైతులకే రైతుబంధు నగదు జమ చేస్తున్నారు. అదికూడా విడతల వారీగా జమ చేస్తున్నారు. రైతుబంధు బకాయిల కోసం ఎందరో రైతులు ఇంకా ఎదురుచూస్తున్నారన్నది నిజం.
రా్రష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని పూర్తిగా అమలు చేశామంటూ సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో చెప్పారు. 25 లక్షల మంది రైతులకు సంబందించి రూ.21వేల కోట్ల రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. అయితే రాష్ట్రంలో ఎక్కడా పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ అమలు కాలేదు. రేవంత్ సర్కార్ రూ.35 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నామని చెప్పి కేవలం రూ.21 కోట్లు రుణమాఫీ చేసింది. ఇంకా రూ.14 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉన్నది. దానికోసం ఇంకా రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేశామని రేవంత్‌రెడ్డి మరో పచ్చి అబద్ధం వల్లెవేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని 6 లక్షల మందికిపైగా పేదలకు కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేశారు. ఇందిరమ్మ ఇండ్లపైనా రేవంత్‌రెడ్డి అవే అబద్ధాలు ఆడారు. రా్రష్ట్రంలో 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టామని, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరే లేదంటూ గొప్పలు చెప్పారు. అయితే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాకపోవడంతో పేదలెందరో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇది వరకే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న పేదలు బిల్లులందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటికి రూ.5 లక్షల ఆర్థికసాయం స్థానంలో ప్రభుత్వం కేవలం రూ.3.50 లక్షల మాత్రమే చెల్లిస్తున్నట్టు లబ్ధిదారులు రేవంత్ సర్కార్‌పై మండిపడుతున్నారు.
రాష్ట్రంలో రైతులందరికీ 24గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నామని సంగారెడ్డి సభలో రేవంత్‌రెడ్డి సమర్థించుకొన్నారు. కానీ, రాష్ట్రమంతటా కరెంటు కోతలతో రైతులతోపాటు గృహ, పరిశ్రమల వినియోగదారులూ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు స్థానంలో 9 నుంచి 11 గంటల కరెంటు మాత్రమే సరఫరా అవుతుంది. గత రెండు నెలలుగా కరెంటు కోతలు పెరుగడంతో రైతులు పలు చోట్ల ఏకంగా ధర్నాలకు దిగిన ఘటనలు చోటుచేసుకొన్నాయి. మరి ఆ రైతుల ఆందోళనలు రేవంత్‌రెడ్డికి కనిపించడం లేదా? వారి నిరసనల హోరు వినిపించడం లేదా?
సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డి పర్యటన సందర్బంగా జిల్లా అభివృద్ధి కోసం నిధులు ప్రకటిస్తారని జిల్లా ప్రజలు, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఆశపడ్డారు. కానీ, సంగారెడ్డి సభలో ఆ జిల్లాకు సీఎం ఎలాంటి వరాలు ప్రకటించకపోవడంతో వారికి నిరాశే మిగిలింది. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న తాగు, సాగునీరు, కరెంటు తదితర సమస్యలపైనా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ తన నియోజకవర్గంలోని సింగూరు ప్రాజెక్టును టూరిజం కేంద్రంగా ప్రకటించాలని ఇదే సభలో కోరారు. రాజనర్సింహ వినతిని కూడా సీఎం పట్టించుకోకపోవడం గమనార్హం.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రొటోకాల్ అమలు జరగడమే లేదు. ముఖ్యమంత్రి ఈ సంగారెడ్డి పర్యటన సందర్భంగా కూడా అధికార యంత్రాంగం ప్రొటోకాల్ పాటించలేదు. సీఎం జిల్లా పర్యటనలు, ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే స్థానిక ఎమ్మెల్యే కచ్చితంగా అధ్యక్షత వహిస్తారు. జిల్లాలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను సీఎం సభ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆహ్వానిస్తారు. శనివారం సీఎం రేవంత్ సంగారెడ్డి పర్యటన సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు అధికారులు ఆహ్వానమే అందించలేదు. సీఎం సభకు ప్రొటోకాల్ ప్రకారం తనను పిలువాలని, జిల్లా కలెక్టర్‌గానీ, ఇతర అధికారులు కానీ తనకు కనీస సమాచారమే ఇవ్వలేదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, మహిపాల్‌రెడ్డికి కూడా అధికారులు సీఎం సభకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడం విస్మయం కలిగిస్తున్నది. జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి టీజీఐఐసీ చైర్మన్ పదవీకాలం ముగిసింది. దీంతో నిర్మలకు తిరిగి ఆ పదవి పొడిగింపుపై సీఎం ఎలాంటి హామీ ఇవ్వకపోడంపై జగ్గారెడ్డి అనుచరులకు నిరాశ మిగిలింది. ఇదే సభలో జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ సీఎం వెనుక రెండో వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్ వేదికపై ముందువరుసలో కూర్చొనేందుకు సీఎం సెక్యూరిటీ సిబ్బంది మొదట అనుమతించలేదు. జడ్పీ మాజీ చైర్పర్సన్ సునీతాపాటిల్ కలుగజేసుకోవడంతో ముందు వరుసలో కూర్చునేందుకు అనుమతించారు. సీఎం బహిరంగసభలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, వివేక్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, నవీన్‌యాదవ్, కార్పొరేషన్ చైర్మన్లు ఫహీం, గిరిధర్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్, కాటా శ్రీనివాస్‌గౌడ్, తోపాజీ అనంతకిషన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను మోసపుచ్చేలా రేవంత్‌రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 70 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చామంటూ రేవంత్‌రెడ్డి అవే అబద్ధాలు మళ్లీ ఆడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా నెరవేర్చుకోలేదు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు తుది ఫలితాలు మాత్రమే రాగా, ఉద్యోగాలొచ్చిన ఆ యువతకు రేవంత్ సర్కార్ అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు ఇచ్చి తానే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తూనే వస్తున్నారు. రేవంత్ సర్కార్ ఇప్పటివరకు 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆ నిరుద్యోగ యువకులే ఘంటాపథంగా చెప్తున్నారు.