కార్పొరేట్ ఉద్యోగులు రెండు రకాలుగా ఉంటారు. మొదటిరకం.. పని కోసం ఉదయాన్నే నిద్రలేస్తారు. ఉన్నతాధికారుల కన్నా ముందే.. ఆఫీస్‌లో వాలిపోతారు. ఇక రెండోరకం.. రాత్రంతా మేల్కొని ఉండి, పనిని పూర్తిచేస్తారు. అయితే, వీరిలో ఎవరి కెరీర్లో ఎదుగుదల బాగుంటుంది? అనే విషయంపై నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
సంప్రదాయ కార్యాలయాల్లో ఉదయాన్నే ఆఫీస్‌కు వచ్చేవారికి కొంత వెసులుబాటు ఉంటుందట. అలాగని వారు మరీ ఎక్కువ పని చేస్తున్నారని కాదు. మేనేజ్మెంట్ దృష్టిలో వారికి మంచి అభిప్రాయం ఉండటం వల్ల.. వారి ఎదుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ అప్లయిడ్ సైకాలజీలో ఒక అధ్యయనం ప్రచురితమైంది. దీని ప్రకారం, ఉద్యోగులు ఎంత బాగా పనిచేశారు? ఎన్ని గంటలు పనిచేశారు? అనే దానితో సంబంధం లేకుండా.. ఉదయాన్నే ఆఫీసుకు వచ్చేవారికి మేనేజర్ల నుంచి సానుకూల రేటింగ్‌లు లభించాయట. సాధారణంగా ఉదయాన్నే ఆఫీస్‌కు రావడాన్ని అంకితభావం, బాధ్యతాయుత ప్రవర్తనగా మేనేజర్లు భావిస్తారట. దీనివల్ల వారికి మంచి పెర్ఫార్మెన్స్ రేటింగ్‌లు వస్తాయని ఆ అధ్యయనంలో తేలింది.
ప్రమోషన్లలో ఈ రేటింగ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి, ఉదయాన్నే ఆఫీస్‌కు వచ్చేవారికి ఈ రకంగా పరోక్ష ప్రయోజనం చేకూరుతుంది. అలాగని రాత్రిపూట మేల్కొని పనిచేసేవాళ్లు తక్కువ పనితీరు చూపిస్తున్నారనీ కాదు. జపాన్‌కు చెందిన 8,217 మంది ఉద్యోగులపై గతంలో నిర్వహించిన ఒక అధ్యయనం.. జీవ గడియారంలో మార్పు ఉన్నంత మాత్రాన ఉత్పాదకత తగ్గదని తేల్చింది కూడా. అయితే, ఉద్యోగులు తమ జీవ గడియారానికి విరుద్ధంగా పనిచేయాల్సి వచ్చినప్పుడే సమస్యలు తలెత్తుతాయని గుర్తించింది.
సృజనాత్మకత అనేది రోజులోని సమయంపై కాకుండా.. ఆ వ్యక్తి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ ఉద్యోగులు ఉదయం వేళల్లో అధిక సృజనాత్మకతను చూపిస్తే.. రాత్రి మేల్కొనేవారు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో అద్భుతమైన ఆలోచనలతో ముందుకు వస్తారు. అయితే, చాలా కంపెనీలు ఇప్పటికీ సాంప్రదాయ 9-5 పని వేళలనే అనుసరిస్తున్నాయి. అందుకే ఆఫీస్ సమావేశాలలో, మేనేజ్మెంట్తో జరిగే చర్చలలో ఉదయాన్నే వచ్చేవారు ఎక్కువగా గుర్తింపు పొందుతారు.
నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఎంత నాణ్యతతో పనులను పూర్తి చేసినప్పటికీ.. ఉదయం వచ్చేవారికే ఎక్కువ గుర్తింపు దక్కుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే, కెరీర్ ఎదుగుదలకు సంబంధించి ప్రమోషన్లు, ఇతర సందర్భాల్లో వారివైపే కాస్త మొగ్గుచూపుతారని అంటున్నారు. అయితే, జీతం విషయంలో మాత్రం నైట్ షిఫ్ట్ ఉద్యోగులే ముందుంటారట. నైట్ అలవెన్స్‌లు, ఇతరత్రా భత్యాలు కలుపుకొని.. వారికి ఎక్కువ మొత్తం అందే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.