సూర్యోదయ సూర్యాస్తమయాలు మన చేతిలో ఉండవు. కానీ నిరంతరం కండ్ల మీద కాంతిని ప్రసరింపజేసే అరచేతి తెరలకు మాత్రం మనమే సన్సెట్ను సెట్ చేసుకోవచ్చు. దాన్నే ‘డిజిటల్ సన్సెట్’ అని పిలుస్తున్నారు ఈ కాలంలో. అదెలా అంటారా ఇదిగో ఇలా…
రోజంతా చాలా వరకూ స్క్రీన్తోనే గడుపుతుంటాం. ఇప్పుడు పనులన్నీ వాటితోనే. ఇక, రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటు. కాసేపు సందేశాలు చూస్తే, మరికాసేపు సామాజిక మాధ్యమాల్లో విహరిస్తే… అలా నిద్రపోవాల్సిన సమయం కాస్తా దాటిపోతుంది. ఉదయం లేవగానే అలసట వెంటాడుతుంది. ఈ అలవాటుకు చిన్న మార్పు తీసుకొచ్చేదే ‘డిజిటల్ సన్సెట్ ’. అంటే నిద్రకు కొంతసేపు ముందు నుంచే ఫోన్, ఇతర తెరలకు దూరంగా ఉండటం.
ఇందుకోసం పడుకోవడానికి అరగంట లేదా గంట ముందు ఫోన్ ను పకన పెట్టేయాలి. ఆ సమయంలో పుస్తకం చదవడం, మృదువైన సంగీతం వినడం, మరుసటి రోజు పనులను రాసుకోవడం లేదా ప్రశాంతంగా కూర్చోవడం వంటివి చేయొచ్చు. ఇలా చేయడం వల్ల తెరల నుంచి వచ్చే వెలుగుతో పాటు, వరుసగా వచ్చే మెసేజులు, ఇతర సమాచారంతో మనసుకు కలిగే అలజడిని కూడా తగ్గించుకోవచ్చు. అయితే మార్పు ఊరికే రాదు.
మొదట్లో ఫోన్ చూడాలనే కోరిక బాగానే కలగవచ్చు. అందుకే నిద్రకు ముందు ఒక నిర్ణీత సమయాన్ని ఎంచుకుని, ఫోన్ను మంచానికి దూరంగా ఉంచడం మంచిది. అత్యవసర కాల్స్ కోసం మాత్రం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. కాబట్టి, ఆరోగ్యకరమైన నిద్ర కోసం ఖరీదైన పరికరాలు అవసరం లేదు. రాత్రి వేళ ఫోన్ కు ఇచ్చే చిన్న విరామమే ప్రశాంతమైన నిద్రను తెచ్చిపెడుతుందన్నమాట!