వానకాలంలో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. గాలిలో తేమశాతం పెరుగుతుంది. మనల్ని ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్ల బారిన పడేస్తుంది. అయితే, కాలానికి తగ్గట్టుగా జీవనశైలిలోనూ మార్పులు చేసుకున్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. శరీరానికి ఏం కావాలో తెలుసుకొని మసలుకుంటే.. అనారోగ్యానికి గురికాకుండా ఉంటుంది.
గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు లేదా అల్లంతో మీ రోజును ప్రారంభించండి. ఇన్ఫెక్షన్లతో పోరాడేలా మీ రోగనిరోధక వ్యవస్థను సిద్ధం చేయడానికి.. ఆహారంలో వెల్లుల్లి, తులసి, సీజనల్ పండ్లను చేర్చుకోండి. ఈ చిన్నచిన్న మార్పులే మీ శరీరాన్ని దృఢంగా మార్చడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను ఎంచుకోండి. కిచిడీ, వేడివేడి సూప్, ఆవిరిపై ఉడికించిన కూరగాయలు, రోటీలను డైట్లో భాగం చేసుకోండి. నూనెలో వేయించిన పదార్థాలు, చల్లని లేదా మిగిలిపోయిన ఆహారాన్ని తగ్గించండి. జీర్ణవ్యవస్థ బలంగా ఉన్నప్పుడే.. కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుంచి మనకు రక్షణ లభిస్తుంది.
ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి. వర్షంలో తడిస్తే.. దుస్తులను త్వరగా మార్చుకోండి. ఇక తడి సాక్స్‌లు, నీటి గుంటలలో నడవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే, పాదాలను శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి. తడి జుట్టు లేదా దుస్తులతో ఏసీ గదుల్లో కూర్చోవడం మానుకోండి. నిద్రలేమి, అధిక ఒత్తిడి కూడా మీ రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. కాబట్టి, రోజూ ఒకే సమయానికి నిద్రపోవడానికి ప్రయత్నించండి. అర్ధరాత్రి వరకూ స్క్రీన్లు చూడటం తగ్గించండి. మామూలు రోజుల కన్నా.. పగటిపూట కాసేపు ఎక్కువ విశ్రాంతి తీసుకోండి. దీనివల్ల నాడీ వ్యవస్థ వేగంగా కోలుకుంటుంది. అనారోగ్యానికి గురికాకుండా ఉంటుంది.
ముసురు పడితే.. ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. రెగ్యులర్ వ్యాయామం దూరం అవుతుంది. కాబట్టి, ఆయా రోజుల్లో ఓ 20 – 30 నిమిషాల పాటు ఇంట్లోనే నడవడం, తేలికపాటి యోగా, సాధారణ శారీరక కదలికలు చేయడం అలవాటు చేసుకోండి. రక్త ప్రసరణ, జీర్ణక్రియ, మానసిక స్థితిని మెరుగు పరుచుకోండి. శరీరంలో కదలికలు లేకపోతే.. రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. తేలికపాటి వ్యాయామమైనా..
శరీర వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.