Promissory Note : ‘ప్రామిసరీ నోట్ (Promissory Note) అనేది ఒక పక్షం మరొక పక్షానికి నిర్దిష్ట భవిష్యత్ తేదీ నాటికి తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తానని రాసి ఇచ్చే ఒక వాగ్ధాన పత్రం. ఈ ప్రామిసరీ నోట్లు ఎక్కువగా గ్రామాల్లో ఉపయోగిస్తారు. వ్యవసాయ పనుల కోసం, గ్రామాల్లోని వ్యక్తుల అవసరాల కోసం, ఏదైనా అత్యవసరం కోసం ఇతరుల దగ్గర వడ్డీకి తెచ్చుకుంటారు. ఈ ప్రామిసరీ నోట్లో వడ్డీ రేటు, తిరిగి చెల్లింపు షెడ్యూల్, నోటు చెల్లుబాటు అయ్యే తేదీ తదితర వివరాలు ఉంటాయి.
ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి అప్పు తీసుకున్నప్పుడు ఈ నోట్‌పై సంతకం చేసి, సాక్ష్యుల సంతకాలు చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ డబ్బు తీసుకున్న వ్యక్తి సరైన సమయానికి చెల్లించకపోతే కోర్టులో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కోర్టుకు డిఫాల్ట్ సాక్ష్యాన్ని అందించాక, నోట్ చెల్లుబాటు అయ్యిందని ప్రూవ్ అయ్యాక, డబ్బు కట్టని వ్యక్తిని విచారణకు హాజరవ్వమని కోర్టు నోటీసులు పంపుతుంది. కొంతమంది కోర్టు వరకు వెళ్లకుండా మధ్యవర్తుల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు.
ప్రామిసరీ నోటు చట్టపరంగా ఆమోదయోగ్యత పొందాలంటే వివరాలు సక్రమంగా ఉండాలి. ప్రామిసరీ నోటు రాతపూర్వకంగా ఉండాలి. అప్పు తీసుకునే వారి పేర్లు క్లారిటీగా ఉండాలి. షరతులు లేకుండా ఉండాలి. మనం డబ్బు ఎవరికి ఇస్తున్నామో వాళ్ల పేర్లు, ప్రామిసరీ నోటు రాసిన ప్రదేశం, తేదీలు కూడా క్లారిటీగా రాయాలి. అప్పుగా ఎంత డబ్బు ఇచ్చామో అంకెల్లో, అదేవిధంగా అక్షరాల్లో రాయాలి. తర్వాత రెవెన్యూ స్టాంప్ అంటించాలి. ఇరుపక్షాల వారు సంతకాలు చేయాలి.
వీరితోపాటుగా సాక్ష్యుల సంతకాలు, అదేవిధంగా వారి వివరాలు కూడా ఉంటే బెటర్. అంతేకాకుండా ఈ ప్రామిసరీ నోటులో డబ్బు చెక్కు ద్వారా ఇచ్చారో లేదా నగదు ఇచ్చారో కూడా రాయాలి. చివర్లో ప్రామిసరీ నోటులో పోస్టాఫీసు జారీచేసిన రెవెన్యూ స్టాంప్‌లను అతికించాలి.