ప్లేస్కూల్‌ను మరిపించేలా గూడెం కేంద్రం
మంత్రి కేటీఆర్ చొరవతో వసతులు
మోడల్‌గా నిలిచిన అధునాతన భవనం
రూ.25 లక్షలతో సర్వాంగ సుందరంగా ఏర్పాటు
డిజిటల్, అబాకస్, పద్ధతిలో బోధన
చైల్డ్ ఫ్రెండ్లీ వాతావరణంలో చిన్నారులు
సిరిసిల్ల/ముస్తాబాద్, ఫిబ్రవరి 24 : ఆహ్లాదకర వాతావరణం.. చిన్నారులు ఆడుకునేందుకు తీరొక్క ఆటవస్తువులు.. వారిలో సృజనాత్మకతను పెంపొందించేలా ఆకర్షణీయమైన బొమ్మలు.. వినూత్న పరికరాలు.. డిజిటల్ పద్ధతిలో విద్యాబోధన.. ఇదేదో కార్పొరేట్ ప్లే స్కూల్ కాదు.. పట్టణాల్లో ఉండే ప్రైవేటు బడి అంతకన్నా కాదు.. ఒక మారుమూల గ్రామమైన ముస్తాబాద్ మండలం గూడెంలోని అంగన్వాడీ కేంద్రం.. రూ.25 లక్షలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఈ అంగన్వాడీ సెంటర్ ఇతర కేంద్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. దీని కోసం మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోగా, ఈ నెల 14న ఆయనే స్వయంగా కేంద్రాన్ని ప్రారంభించారు.
ముస్తాబాద్ మండలంలోని గూడెంలో మూడు అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీ-హబ్ స్టార్టప్ కంపెనీ వీటన్నింటినీ ఒకే చోట చేర్చి రూ.25 లక్షలతో మోడల్ కేంద్రాలుగా ఆధునీకరించింది. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా నూతన ఒరవడితో విద్యాబోధన విధానాన్ని అమలు చేస్తున్నారు. మూడు కేంద్రాల్లో దాదాపు 103 మంది చిన్నారులకు అన్ని రకాల విద్యావసతులు కల్పించారు. విశాలమైన ఆట స్థలంలో క్రీడా పరికరాలను అమర్చారు. గదుల గోడలకు లోపల, బయట చిన్నారులను ఆకట్టుకునే రంగు రంగుల బొమ్మలు వేయించారు. సంఖ్యాశాస్ర్తాన్ని బోధించేందుకు అబాకస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆంగ్ల భాషలో డిజిటల్ పాఠాలు, సౌండ్ సిస్టమ్‌తో విద్యాభోధన జరిపేలా పరికరాలను ఏర్పాటు చేశారు. చిన్నారులకు మోడల్ టాయ్‌లెట్ సౌకర్యం కల్పించారు. ఆహ్లాదాన్ని పంచేలా పచ్చదనం పెంచారు. ఆటస్థలంలో జారుడు బండ, సైక్లింగ్ వంటివి ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటలు, విద్యాబోధన ఆహ్లాదకరంగా సాగేలా వాతావరణం కల్పించారు. తరగతిలో అలసిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేకంగా స్లీపింగ్ రూంను ఏర్పాటు చేశారు. చిన్నారులకు నెలకు 16 గుడ్లు, బాలామృతం అందిస్తున్నారు.
మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు
మా గ్రామానికి మోడల్ అంగన్వాడీ సెంటర్‌ను మంజూరు చేయడంతో పిల్లలను ప్రైవేటుకు పంపించడం లేదు. తల్లిదండ్రులందరూ తమ చిన్న పిల్లల్ని ఈ కేంద్రానికే పంపుతున్నారు. ఇందులో ఏర్పాటు చేసిన పరికరాలు, కల్పిస్తున్న విద్యాబోధనతో చిన్నారులు అన్నిరకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. పిల్లల్లో మానసిక, శారీరక అభివృద్ధి మోడల్ అంగన్వాడీతోనే సాధ్యమవుతుంది. ప్లే స్కూల్‌కు దీటుగా ఈ కేంద్రాలు నడుస్తున్నాయి.
– చిట్నేని సరిత, గూడెం సర్పంచ్
ప్రైవేటుకు దీటుగా నిర్వహణ
గూడెం అంగన్వాడీ కేంద్రాలను మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఆధునీకరించారు. ఇక్కడ చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా విద్యా బోధన జరుగుతున్నది. అబాకస్, డిజిటల్ పాఠాలను ఇష్టంగా వింటున్నారు. మా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
–కే కిరణ్మయి, అంగన్వాడీ టీచర్, గూడెం