గోదావరిఖని, మే 10 : ‘మీ బాధలు తెలిసిన కార్మికుడా? లేదంటే ఏసీ రూముల్లో ఉంటూ మీ సాదకబాధకాలు తెలియని శ్రీమంతుడా? ఎవరు కావాలో మీరే ఆలోచించాలి’ అంటూ ఓటర్లకు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించాలంటే కారు గుర్తుకు ఓటేసి, ప్రశ్నించే గొంతుకకు పట్టంగట్టాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మంథని, పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మారంలో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు.
ఖనిలోని రమేశ్‌నగర్, ఆర్జీ-2 ఏరియాలోని ఓసీపీ-3 ప్రాజెక్టులో లోని బేస్ వర్క్‌షాప్, ఎస్అండ్డీ, షావల్, డోజర్ సెక్షన్లలో కార్మికులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆయాచోట్ల కొప్పుల మాట్లాడారు. మోసపూరిత హామీలిచ్చి అధికారం చేపట్టిన హస్తంపార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఆయన వెంట పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మాజీ మంత్రి రాజేశంగౌడ్ తదితరులు ఉన్నారు.