e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home కామారెడ్డి సెల్‌.. హెల్

సెల్‌.. హెల్

  • మానసిక రోగిగా మారుతున్న వైనం
  • అనుమానాలు, లైంగిక సంబంధాలతో పచ్చని కాపురాల్లో సెల్‌ చిచ్చు
  • క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు మొబైల్‌కు బానిసవుతున్న యువత

సెల్‌ ఫోన్‌తో అనేక అనర్థాలు వస్తున్నాయి. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ బంధాలను మంటగలుపుతున్నది. చవకగా దొరుకుతున్న ఇంటర్నెట్‌ సౌకర్యం అనుబంధాలను కాలరాస్తున్నది. సెల్‌ఫోన్‌తో మారిన జీవనశైలి అధఃపాతాళంలోకి నెట్టేస్తున్నది. అన్యోన్య దాంపత్యంలో అడ్డుగోడలు నిర్మిస్తున్నది. పసి మనసుల్లో విషబీజం నాటుతున్నది. సెల్‌ మాయలో పడి అదే జీవితంగా బతుకుతున్న యువత తమ బతుకు దుర్భరం చేసుకుంటున్నది. తాజా పరిశోధనలో ప్రతి వంద మందిలో ఇరవై ఐదు మంది సెల్‌ఫోన్‌కు బానిసలైనట్లు తేలింది. అదే పనిగా గంటల తరబడి సెల్‌ లోకంలో విహరిస్తూ, మానవ సంబంధాలను పాతరేస్తున్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. అనుకున్నది సాధించి, లక్ష్యాన్ని ఛేదించి తలెత్తి తిరగాల్సిన యువత సెల్‌ఫోన్‌లోకి గంటల తరబడి తొంగి చూస్తూ తల దించుకుంటున్నది. తల్లిదండ్రులు దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తుండడంతో ఇలలోనే సెల్‌ నరకం చూపుతున్నది. పెరిగిన, విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో విస్తరించిన స్మార్ట్‌ ఫోన్ల సంస్కృతి మనిషి జీవితాన్ని శాసిస్తూ నాశనం వైపు తీసుకెళ్తున్న వైనంపై ప్రత్యేక కథనం.

హైదరాబాద్‌కు చెందిన తల్లిదండ్రులు తమ రెండేండ్ల బాబును తీసుకొని నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మానసిక వైద్య నిపుణుడి వద్దకు వచ్చారు. ఆ బాబు సెల్‌ఫోన్‌ చేతికిస్తేగానీ అన్నం తినడం లేదట. మారాం చేస్తున్నాడట. విషయం తెలుసుకున్న ఆ వైద్యుడు నోరెళ్లబెట్టాడు. స్వయంగా ఆ తల్లే పిల్లాడికి అన్నం తినిపించే ముందు సెల్‌ఫోన్‌ను చేతికందించడం అలవాటు చేసింది. దీంతో నిత్యం చేతిలో సెల్‌ ఉంటేగానీ ఆ బుడ్డోడికి ముద్ద గొంతు దిగడం లేదు. చిన్న వయసు నుంచే పిల్లలకు సెల్‌ఫోన్‌ను అలవాటు చేయడం ఫ్యాషన్‌గా మారిందనడానికి ఇదో ఉదాహరణ. తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంచి వాటిని ఉపయోగిస్తున్న తీరుకు సంబురపడుతూ పక్కవాళ్లతో మావాడు ఎంత అద్భుతంగా సెల్‌ఫోన్‌తో ఆడుకుంటాడో అని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ అనంతర పర్యవసనం వారి నాశనానికి దారి తీస్తుందని తెలుసుకోలేకపోతున్నారు.

- Advertisement -

మనస్పర్ధలు.. అనుమానాలు..

సెల్‌ఫోన్‌లో పొర్నోగ్రఫీ చూస్తూ ఇటు యువత పక్కదారి పడుతుండగా అటు దంపతుల మధ్య మనస్పర్ధలు, అనుమానాలకు బీజం పడుతున్నది. దీంతో పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. సెల్‌ఫోన్‌తో ఎవరికి వారే గంటల తరబడి నిమగ్నమై అదే లోకంగా బతుకుతున్న దంపతుల సంసారం కల్లోలంగా మారుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎడముఖం పెడముఖంగా సంసారం చేస్తున్నారు. ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గి మనస్పర్ధలు, అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. అన్యో న్య దాంపత్యం కాస్త ఆగమాగమవుతున్నదని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు సెల్‌ఫోన్‌కు బాగా అలవాటు పడి ఆ తర్వాత దానికి దూరమైన సందర్భాల్లో పిచ్చి వారిగా మారిన సంఘటనలు కూడా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. సెల్‌ఫోన్‌లో ఆడే కొన్ని గేమ్‌లు హింస, రక్తపాతంతో కూడుకొని ఉండడంతో చిన్న పిల్లల మనసులను కల్మశం చేస్తున్నాయని అంటున్నారు

మారిన అలవాట్లు..

సెల్‌ వినియోగం పెరిగిన నాటి నుంచి యువత క్రమంగా ఆల్కాహాల్‌, సిగరెట్‌ తాగడం లాంటి అలవాట్లకు కొంత దూరంగా ఉంటున్నట్లు కూడా వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. గంటల తరబడి సెల్‌ఫోన్‌ చాటింగ్‌లో నిమగ్నమై లోకాన్ని మరిచిపోయి ఉండే యువత ఆల్కాహాల్‌ తాగే అలవాటుకు కొంత దూరమున్నట్లు గుర్తించారు. సిగరెట్‌ తాగే అలవాటు కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టినట్లు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి సెల్‌ఫోన్‌ను ఒక నిత్యావసర వస్తువుగా, జీవితంలో ఒక భాగంగా మారిపోవడంతో కొత్త రోగాలకు అవకాశమిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు ఓపిక లేకపోవడం, ఇద్దరూ ఉద్యోగులు కావడం, పని తొందరగా ముగించాలనే అత్రుత, పిల్లలు అల్లరి చేయకుండా ఉండేందుకు ఈ సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. పిల్లలకు దీన్ని అలవాటు చేస్తున్నారు. కానీ దీన్ని ప్రోత్సహించడం ప్రమాదకరమని గ్రహించలేకపోతున్నారు.

అన్నీ అనర్థాలే..

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌తో ప్రాణాలు పోతున్నా పెద్దగా మార్పు కనిపించడం లేదు. గంటల తరబడి సెల్‌లో చాటింగ్‌ చేయడంలోనే మజా ఉందని యువత దానికే అలవాటు పడుతున్నది. దీంతో నిద్రలేమి సమస్య ప్రధానంగా వెంటాడుతున్నది. రాత్రివేళల్లో గంటల తరబడి సెల్‌ఫోన్లో తలదూర్చి నిద్రకు దూరమవుతున్నారు. నిత్యం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు మనిషికి నిద్ర అవసరం. కానీ సెల్‌ వినియోగం పెరిగిన కొద్దీ రాత్రివేళల్లో నిద్రపోయే సమయం తగ్గుతూ వస్తున్నది. నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్రపోవడంతో మానసిక రుగ్మతలు కొనితెచ్చుకున్నట్లవుతున్నది. క్షణికావేశానికి లోనుకావడం, ఆత్మహత్య చేసుకోవడం లాంటి దుశ్చర్యలకు కూడా పాల్పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. వీడియో కాలింగ్‌తో పలు అనర్థాలు కూడా చోటు చేసుకుంటున్నట్లు వెల్లడవుతున్నదని చెబుతున్నారు. ఈ వ్యసనంతో ఆర్థికంగా నష్టపోవడం, బంధుత్వాలు దూరం కావడం, తెలివి
తేటలు తగ్గడం, నిద్రలేమి కారణంగా గుండెపోటు, బీపీ, షుగర్‌, థైరాయిడ్‌, వెంట్రుకలు ఊడిపోవడం, మతిమరుపు, చిరాకు, కోపం, సెక్స్‌ సమస్యలు, ఆందోళన, గుండెదడలతోపాటు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కొంపముంచుతున్న ఉచిత డాటా..

ఒకప్పుడు ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. గ్లోబలైజేషన్‌లో భాగంగా ప్రపంచమే కుగ్రామమైన నేపథ్యంలో పలు సంస్థలు ఇంటర్నెట్‌ వాడకాన్ని మరింత చవక చేశాయి. అందరికీ అందుబాటులోకి తెచ్చాయి. ప్రతి నట్టింట్లో నెట్‌ వీరవిహారం చేస్తున్నది. వైఫై తరంగాల్లో జీవితం గింగిరాలు తిరుగుతున్నది. వాట్సాప్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, మొబైల్‌ గేమ్స్‌ తదితర వాటిని అలవాటుగా చేసుకొని అదే లోకంగా యువత బతుకుతున్నది. కీలకమైన యుక్త వయస్సులో సెల్‌ఫోన్‌ మాయలోపడి పక్కదారులు పడుతున్నది. లక్ష్యాలు నిర్దేశించుకొని ఉన్నతంగా ఎదగాల్సిన వయసులో తమ మేథస్సును ఉచిత ఇంటర్నెట్‌ డాటాకు బలిపెడుతున్నది. విలువైన జీవితాన్ని కోల్పోతున్నది.

తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి..

చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్‌ఫోన్‌ను అలవాటు చేయొద్దు. గేమ్స్‌, ఆట లు, పాటల పేరుతో వారికి సెల్‌ఫోన్‌ దగ్గరైతే ఆ తర్వాత బం ధాలు, బంధుత్వాలు దూరమవుతాయి. ఈ విషయంలో చిన్నప్పటి నుంచి జాగ్రత్త అవసరం. తరచూ బంధువుల వద్దకు పిల్లలను తీసుకువెళ్తూ ఉండాలి. స్కూల్‌, కాలేజీ, హాస్టళ్లలో సెల్‌ఫోన్లను పూర్తిగా నిషేధించాలి. ఫోన్‌కు బానిసైనట్లు గుర్తిస్తే వెంటనే మానసిక వైద్యులను కలవాలి. కౌన్సెలింగ్‌ ద్వారా నయం చేయడంతోపాటు పరిస్థితి తీవ్రంగా ఉంటే మందుల ద్వారా జబ్బుకు చికిత్స చేయవచ్చు.

  • డాక్టర్‌ విశాల్‌, మానసిక వైద్య నిపుణుడు

సెల్‌ఫోన్‌కు బానిసయ్యారని తెలుసుకోవడానికి ఎనిమిది మార్గాలు..

ఎప్పుడు చూసినా ఫోన్లో చాటింగ్‌ చే స్తూ లోకాన్ని మరిచిపోయి దాంట్లోనే నిమగ్నమై పోవడం.
క్రమక్రమంగా సెల్‌ఫోన్‌కు ఎక్కువ సమయం కేటాయించడం.
సెల్‌ నుంచి దూరంగా ఉండాలని అనుకున్న సమయంలో నీరసంగా, చికాకుగా, కోపంగా ఉండడం.
సెల్‌ఫోన్‌ నుంచి దూరంగా ఉండలేక మళ్లీ దానిని ఆశ్రయించడం.
అవసరం కంటే ఎక్కువగా సెల్‌ఫోన్‌ వినియోగించడం. పరీక్షలు తప్పడం, బంధుత్వాలు దెబ్బతినడం, ప్రమాదాలు జరగడం లాంటివి చోటు చేసుకోవడం.
ఇన్ని నష్టాలు సెల్‌ఫోన్‌తోనే జరుగుతున్నాయని తెలిసీ ఆ వ్యసనం నుంచి దూరం కాలేకపోవడం.
అబద్ధాలు చెప్పడం. రోజుకు 15 నుంచి 16 గంటలపాటు సెల్‌లో నిమగ్నం కావడం.
బాధలు, కష్టాలు, ఆందోళన, డిప్రెషన్ల నుంచి బయటపడేందుకు మళ్లీ ఫోన్‌ను ఆశ్రయించడం.
ఈ అంశాలపై క్లారిటీ తీసుకొని వందశాతం సెల్‌ఫోన్‌ జబ్బుగా వైద్యులు ధ్రువీకరిస్తారు. సైక్రియాట్రిస్టులు దీనికి తగిన మందులు సూచిస్తారు. తొలిదశలో జబ్బు ఉంటే కాగ్నిటీవ్‌ బీహెవియర్‌ థెరపీ ద్వారా నయం చేయవచ్చని, జబ్బు ముదిరితే మందులు వాడాలని చెబుతున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement