కవిత అరెస్టు వ్యవహారంపై కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ చెప్పినట్లు వినలేదనే కారణంతో తన బిడ్డ కవితను అరెస్టు చేశారంటూ కేసీఆర్ భావోద్వేగంతో అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి లొంగేది లేదని, తాను భయపడే వ్యక్తిని కాదని, పోరాటం చేస్తానంటూ చెప్పారు. తాను హిందువునని, తెలంగాణ ప్రజల ఆత్మబంధువునని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల పాలనలో ఘోరంగా విఫలమైందని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ చేసిన మంచి పనులన్నీ ఆగిపోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఇక్కడ మన కండ్ల ముందే కనిపిస్తోందని, వీటన్నంటి మీద నిలదీస్తుంటే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారని మండిపడ్డారు. ‘కేసీఆర్ నీ గుడ్లు తీసుకొని గోలీలు ఆడుతా… నీ పేగులు మెడల వేసుకుంటా… నీ లాగుల తొండలు సొర్రకొడుతా… నిన్ను జైళ్ల వేస్తా…’ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని… జైళ్లకు కేసీఆర్ భయపడుతడా… తాను జైళ్లకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా… అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.