ప్రజా జీవితంతో మమేకమయ్యేది జానపదం. ప్రతి మనిషిలో ఉత్సాహాన్ని నింపేది జానపదం. అటువంటి జానపదానికి కొంతమంది ప్రాణం పోస్తున్నారు. ఆ కొందరిలో కిష్టాపూర్ గ్రామానికి చెందిన మారుశెట్టి హన్మంతు ఒకరు. ప్రకృతిపై ఉన్న అభిమానం, గ్రామంపై ఉన్న గౌరవం, మక్కువతో స్వీయ రచనకు శ్రీకారం చుట్టి ప్రకృతిరా ఇది ప్రకృతిరా అనే పాటతో అద్భుతంగా వర్ణించారు. ప్రస్తుతం ఈ పాట ఆడియో, వీడియో అందరినోటా వినిపిస్తున్నది.
-బీర్కూర్, సెప్టెంబర్ 16
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నడిపి సాయిలు-సాయవ్వ దంపతులకు కొడుకు, కూతురు. కుమార్తెకు వివాహమైంది. పదేండ్ల క్రితం తండ్రి అదృశ్యమయ్యాడు. ఎక్కడికి వెళ్లాడో, ఎలా ఉన్నాడో తెలియని పరిస్థితి. తల్లి సాయవ్వ కూలీనాలీ చేసుకొని, తమకున్న అరఎకరం పొలాన్ని పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొడుకు హన్మంత్ గ్రామంలో సరైన ఉపాధి లేక హైదరాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. హన్మంతుకు పాటల రచన అంటే చాలా ఇష్టం. పెద్ద రచయిత కావాలని కలలు కన్నాడు. చిన్నపాటి ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయంలో పాటలు రచనపై శ్రద్ధ చూపేవాడు. దీంట్లో భాగంగానే తమ గ్రామంపై ఉన్న మక్కువతో కిష్టాపూర్నుద్దేశించి గ్రామానికి ఉన్న సంస్కృతి, పచ్చదనం, చెరువులు, మంజీరా నదిని ఆసరాగా తీసుకొని పాటను రచించాడు. పాటను ముందుగా గ్రామ పెద్దలకు వినిపించి, వారిసహకారంతో కోరుట్ల బృందాన్ని సంప్రదించి వారితో పాటను పాడించారు. అనంతరం ఆ పాటకు అనుబంధంగా వీడియోను రూపొందించారు. ఇందులో హన్మంతు నటించారు. ప్రకృతి పరవళ్లు, కోడి కూతతో మెలకువలు, పల్లె సంప్రదాయం, అనుబంధాలను వివరిస్తూ తీసిన ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో వీక్షకుల మన్ననలు పొందుతున్నది.
సినిమా పాటలు రాయాలని..
పాట విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. మరో మూడు పాటలు రచించాను. సమాజంపై రెండు పాటలు రాయగా, ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిపై ఓ పాట రాశాను. త్వరలోనే వీటిని పాడించి విడుదల చేస్తాను. సినిమాలకు పాటలు రాయాలన్నదే నా సంకల్పం.
ఉన్నతస్థాయికి ఎదగాలి..
మా గ్రామానికి చెందిన హన్మంతు.. సొంత గ్రామంపై పాట రచించి, వీడియో రూపొందించి మంచి పేరు తెచ్చాడు. ఆయన ఎదుగుదలకు గ్రామం నుంచి పూర్తి సహకారం అందిస్తాం. హన్మంతు మరెన్నో మంచి పాటలు రాయాలని, గ్రామానికి మంచి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలి. ప్రభుత్వ పరంగా ఏదైనా అవసరం ఏర్పడినా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో సహాయం అందేలా చూస్తాం.