e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home జనగాం నిషా కోసం వింత పోకడ

నిషా కోసం వింత పోకడ

  • మత్తెక్కేందుకు బోన్‌ఫిక్స్‌, పాలిగ్రిప్‌ వంటివి వినియోగం
  • జోరుగా గంజాయి విక్రయాలు.. బానిసవుతున్న యువత
  • బాధితుల్లో 12 నుంచి 22 ఏళ్లలోపు వారే అధికం
  • సరిహద్దు రాష్ర్టాల నుంచి జయశంకర్‌ జిల్లాకు సరఫరా
  • చెక్‌ పోస్టులు లేని మార్గాల ద్వారా రవాణా
  • సీఎం ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు అప్రమత్తం

జయశంకర్‌భూపాలపల్లి, అక్టోబర్‌ 20 (నమస్తే తెలంగాణ) : స్పిరిట్‌, దగ్గుమందులే కాదు.. నిషా కోసం యువత కొత్త దారులు తొక్కుతున్నది. ఫర్నిచర్‌ తయారీ, ఇంటి నిర్మాణాల్లో వాడే బోన్‌ఫిక్స్‌, పాలిగ్రిప్‌ వంటి పేస్ట్‌లను సిగరెట్‌తో కలిపి సేవిస్తూ మత్తులో జోగుతున్నది. వీటికి గంజాయి కూడా తోడవడంతో కిక్కుకు అవధుల్లేకుండా పోతున్నది. ఎక్కువగా 12 ఏళ్ల నుంచి 22ఏళ్ల లోపువారే బానిసవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. జయశంకర్‌ జిల్లా కేంద్రంతో పాటు వివిధ రాష్ర్టాల సరిహద్దులు కలిగిన మండలాల యువకులే ఎక్కువగా మత్తు పదార్థాలను వినియోగిస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు అప్రమత్తమయ్యాయి. కాటారం మండలంలో కొందరిపై కేసులు సైతం నమోదు చేసినట్లు తెలిసింది. స్మగ్లర్లు మహారాష్ట్ర, సిరోంచ, చెన్నూరు మీదుగా అన్నారం బరాజ్‌ నుంచి కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌రావు మండలాలతో పాటు జిల్లా కేంద్రాలకు గంజాయిని సరఫరా చేస్తుండగా చెక్‌పోస్టులు లేని మార్గాలనే ఎంచుకొని దందా సాగిస్తున్నట్లు స్పష్టమవుతున్నది.

యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. మత్తు కోసం వింత మార్గాలను అన్వేషిస్తున్నారు. మాదక ద్రవ్యాలతో పాటు పీవీసీ పైపులు, ప్లాస్టిక్‌ వస్తువులను అతికించేందుకు వినియోగించే బోన్‌ఫిక్స్‌, పాలిగ్రిప్‌ వంటి వాటిని యథేచ్ఛగా వాడుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అంతర్‌ రాష్ట్ర సరిహద్దు మండలాలకు చెందిన యువకులు ఎక్కువగా వీటికి అలవాటుపడుతున్నారని సమాచారం. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ బృందాలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. గతంలో కాటారం మండల కేంద్రంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గంజాయి తాగుతున్న పలువురు యువకులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. సరిహద్దు రాష్ర్టాల నుంచి యువకులకు గంజాయి సరఫరా అవుతుండగా, దానికి తోడు బోన్‌ఫిక్స్‌, పాలిగ్రిప్‌ వంటి మార్కెట్‌లో సులభంగా లభించే వాటిని అలవాటు చేసుకుంటున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌రావు మండలాలకు సరిహద్దు రాష్ర్టాల నుంచి గంజాయి సరఫరా, వినియోగం విస్తృతంగా పెరిగినట్లు వినికిడి.

- Advertisement -

మహారాష్ట్ర నుంచి సరఫరా..
సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి గంజాయి యథేచ్ఛగా సరఫరా అవుతున్నట్లు సమాచారం. సిరోంచ, చెన్నూర్‌ మీదుగా అన్నారం బరాజ్‌ నుంచి కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌రావు మండలాలతో పాటు జయశంకర్‌ జిల్లా కేంద్రానికి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. మహారాష్ట్ర నుంచి పోలీసు చెక్‌ పోస్టులులేని రహస్య మార్గాలను ఎంచుకుని దందా సాగిస్తున్నట్లు వినికిడి. గంజాయిని ప్యాకెట్లుగా తయారు చేసి మండలకేంద్రాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం.

12 నుంచి 22 ఏండ్ల యువకులే అధికం
మత్తుకు బానిసవుతున్న వారిలో 12 నుంచి 22 ఏండ్ల యువకులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరు గ్రూప్‌గా ఏర్పడి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. గంజాయితో పాటు బోన్‌ఫిక్స్‌, పాలిగ్రిప్‌ వంటి వాటిని సేవిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో ఇంటి వద్దే ఉన్న యువకులు మాదక ద్రవ్యాలు, సిగరేట్‌, పొగాకు ఉత్పత్తులతో మిలితం చేసి సేవిస్తున్నట్లు సమాచారం.

మత్తు కోసం కొత్త పుంతలు…
మత్తు కోసం యువత కొత్త పుంతలు తొక్కుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో గంజాయి విక్రయాలు తగ్గడంతో మత్తుకు అలవాటు పడిన వారు ప్లంబర్స్‌ వినియోగించే బోన్‌ఫిక్స్‌, పాలిగ్రిప్‌ వంటి వాటిని కొనుగోలు చేసి, వాటిని పేపర్‌లో పోసి కాల్చగా వెలువడుతున్న పొగను పీల్చి మత్తులో మునిగి తేలుతున్నట్లు చర్చ సాగుతోంది. జిల్లా కేంద్రంలో కాశీంపల్లి- బాలాజీనగర్‌ క్వార్టర్స్‌, మిలీనియం క్వార్టర్స్‌ సమీపంలోని 5 ఇైంక్లెయిన్‌ జామాయిల్‌ తోట, 2ఇైంక్లెన్‌ ఓపెన్‌ కాస్ట్‌ శ్మశాన వాటిక, 6 ఇైంక్లెన్‌ సమీపంలోని జామాయిల్‌ తోటల్లో పగలు, రాత్రి తేడాలు లేకుండా యథేచ్ఛగా గంజాయి విక్రయ, సేవించే కేంద్రాలుగా ఉన్నట్లు సమాచారం. కాటారం మండల కేంద్రం, మల్హర్‌రావు మండలంలో మల్లారం, తాడ్వాయి గుట్టలు, మహదేవ్‌పూర్‌, కాళేశ్వరం, మహాముత్తారం మండలాల్లో దందాలు కొనసాగుతున్నట్లు సమాచారం.

12 కేసులు నమోదు చేశాం
గంజాయి తాగడం, విక్రయించడం నేరం. అలా చేస్తున్న 12 మందిపై కేసులను నమోదు చేశాం. కాటారం సబ్‌ డివిజన్‌ పరిధిలో కాటారంలో ముగ్గురు యువకులపై జనవరిలో, భూపాలపల్లి సబ్‌డివిజన్‌ పరిధిలో గణపురం మండల పరిధిలో 9 మందిపై జూన్‌లో కేసులు నమోదు చేశాం. గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాలు విక్రయించిన, సేవించినా కఠిన కేసులు ఉంటాయి.
-గండ్రాతి మోహన్‌, ఇన్‌స్పెక్టర్‌, టాస్క్‌ ఫోర్స్‌ విభాగం, జయశంకర్‌ భూపాలపల్లి

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement