గురువారం 29 అక్టోబర్ 2020
Jayashankar - Aug 12, 2020 , 02:40:16

చెక్కు చెదరని చారిత్రక చెరువు

చెక్కు చెదరని చారిత్రక చెరువు

జనగామ జిల్లా జఫర్‌ఘడ్‌ మండలంలోని సాగరం, కోనాయిచలం గ్రామాల మధ్య కాకతీయ రాజులు సుమారు 300 ఏండ్ల క్రితం దంశా చెరువును నిర్మించారు. ‘దంశుడు’ అనే వ్యక్తి ఆధ్వర్యంలో దీనిని కట్టించారని అందుకే చెరువుకు ‘దంశా’ అని పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతారు. ప్రాజెక్టుల కోసం ఇంజినీరింగ్‌ పద్ధ తిని అనుసరించినట్లు ఈ చెరువును కూడా కట్టారని దీని నిర్మాణ శైలిని చూస్తే అర్థమవుతుంది. సాగరం గ్రామ సమీపంలోని కొండ(బోడగుట్ట)ను కోనాయిచలం గ్రామ సమీపంలోని మరో చిన్న కొండకు కలుపుతూ కట్ట నిర్మించారు. దీని పొడవు సుమారు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించడం వల్ల నేటికీ చెక్కు చెదరలేదు. 200 ఫీట్ల వెడల్పుతో ఉన్న చెరువు కట్ట నిర్మాణం చూపరులను ఆకట్టుకుంటోంది.

లక్నవరం, రామప్పకు దీటుగా..

కాకతీయ రాజులు నిర్మించిన చెరువుల్లో లక్నవరం, రామప్ప పెద్ద చెరువులు. ఈ కట్టడాలకు దీటుగా దంశా చెరువును నిర్మించారు. కట్టతో పాటు తూము నిర్మాణాల్లో ఆ చెరువులను పోలి ఉంటాయి. అంతేగాక కట్ట కోసం పెద్ద, పెద్ద బండ రాళ్లను అమర్చిన తీరు, నిర్మాణంలో కూలీలు చూపిన ప్రతిభ అసాధారణమైనది. తూము కూడా అచ్చెరువొందేలా నిర్మించారు. చెరువు కట్టపై నుంచి తూము వద్దకు, అక్కడినుంచి తూము లోపలికి వెళ్లేందుకు ఏర్పాటుచేసిన మెట్ల నిర్మాణం అపురూపంగా కనిపిస్తుంది. ఇదీగాక మత్తడి లేకుండా నిర్మించడం ఈ చెరువుకున్న మరో ప్రత్యేకత. చెరువును పూర్తిస్థాయిలో నింపితే మినీ రిజర్వాయర్‌ను తలపిస్తుంది. శాస్త్ర, సాంకేతికపరంగా అంతగా అభివృద్ధి లేని ఆ కాలంలో ఇలా పటిష్టంగా చెరువు నిర్మించడం గొప్ప విషయమే. అందుకే వందల ఏండ్లయినా ఈ చారిత్రక కట్టడం పటిష్టంగా ఉంది.

గొలుసుకట్టు చెరువులకు జలకళ..

కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులకు అధిక ప్రాధాన్యమిచ్చారు. దంశా చెరువు పూర్తి స్థాయిలో నిండితే ఈ ప్రాంత చెరువుల్లోకి నీటిని మళ్లించేలా దీనిని నిర్మించారు. దంశా చెరువుకు మండలంలోని తీగారం, తిమ్మంపేట నుంచి బోళ్లమత్తడి ద్వారా పడుబాటు వచ్చేలా నాడే కాల్వలు నిర్మించారు. కాలక్రమంలో కాల్వలు పూడుకుపోవడంతో చెరువుకు పడుబాటు రాక పూర్తి స్థాయిలో నిండడం లేదు. ఒకవేళ చెరువు నిండితే గొలుసుకట్టు చెరువులైన సాగరం ఊర చెరువు, వర్ధన్నపేట మండలంలోని బండౌతాపురం చెరువు, ఆ గ్రామాల్లోని కుంటలు, వర్ధన్నపేట గ్రామ పెద్ద కోనపురం చెరువు జలకళ సంతరించుకుంటుంది. కోనపురం చెరువు నుంచి వర్ధన్నపేట మండలంతో పాటు రాయపర్తి మండలంలోని పలు చెరువులకు నీరు చేరుతుంది. దంశా చెరువు తూము నుంచి మండలంలోని తిడుగు, వర్ధన్నపేట మండలంలోని నందనం, బండౌతాపురం, ఇల్లంద, వర్ధన్నపేట సమీప గ్రామాల్లోని ఆయకట్టు కింద భూములు సాగవుతాయి.

గోదావరి జలాలతో నింపాలి

చారిత్రక కట్టడమైన దంశా చెరువును గోదావరి జలాలతో నింపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. సమైక్య పాలకులు పట్టించుకోకవడంతో ఇలాంటి చార్రితక చెరువులు వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం తెలంగాణ సర్కారు చెరువుల మరమ్మతులు, అభివృద్ధికి విశేష కృషిచేస్తున్న నేపథ్యంలో దంశా చెరువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు చారిత్రక గుర్తింపు తేవాలని స్థానికులు వేడుకుంటున్నారు. కాకతీయ రాజుల ఆశయాలకు అనుగుణంగా గొలుసుకట్టు చెరువులకు జలకళ వచ్చేలా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

పర్యాటక అభివృద్ధికి అనుకూలం

చారిత్రక దంశా చెరువు ప్రాంతం పర్యాటకానికి అనుకూలంగా ఉంటుంది. చెరువు కట్ట, నిర్మాణ శైలి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంది. ఈమేరకు చెరువును పూర్తిస్థాయిలో నింపి, పరిసరాలను తీర్చిదిద్దితే ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పర్యాటక ప్రాంతంగా మార్చాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.


logo