e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home జనగాం ఆదరించి.. దారిచూపి..

ఆదరించి.. దారిచూపి..

  • క్లిష్ట పరిస్థితుల్లోనూ యువతకు ఉపాధి మార్గం
  • వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ప్రోత్సాహం
  • శిక్షణ ఇప్పించి.. పెట్రోల్‌పంప్‌లో విధులు
  • పోలీసుల మేలు మరువలేమంటున్న సిబ్బంది
ఆదరించి.. దారిచూపి..

హన్మకొండ సిటీ, జూలై 20 : కరోనా కష్ట కాలంలో కొలువులు పోయి జీవనం కష్టతరంగా మారిన తరుణంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆశాజ్యోతిలా నిలిచింది. నిరుపేద యువతకు ఉపాధి అవకాశాలు చూపుతూ అండగా నిలుస్తున్నది. పలువురు యువతీయువకులకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ పంప్‌లో ఉద్యోగావకాశాలు కల్పించి కొత్తదారి చూపింది. ఏసీపీ సురేంద్రతోపాటు ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్ల పర్యవేక్షణలో ఈ పెట్రోల్‌ పంప్‌ కొనసాగుతున్నది.

నా ఉద్యోగం పోతే పోలీసులే దారి చూపిన్రు
నేను ప్రైవేట్‌ స్కూల్‌లో వార్డెన్‌గా పనిచేశాను. కరోనా కారణంగా ఉద్యోగం నుంచి తీసేశారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో పోలీస్‌శాఖ పెట్రోల్‌ పంప్‌లో పనిచేసేందుకు ఖాళీలున్నట్లు పేపరు ప్రకటన వచ్చింది. సర్టిఫికెట్లు మెయిల్‌ చేసి ఇంటర్వ్యూకు హాజరై సెలెక్ట్‌ అయ్యాను. కష్టకాలంలో పోలీస్‌ శాఖ ఉపాధి కల్పించడం సంతోషంగా ఉంది.
-ఎం నవత, ఐనవోలు, డిగ్రీ

- Advertisement -

24మందికి అవకాశాలు..
హన్మకొండ అంబేద్కర్‌ జంక్షన్‌లోని కమిషనరేట్‌ ఆవరణలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో కొత్త పెట్రోల్‌ పంప్‌ ఏర్పాటు చేశారు. దీనిని జూలై 5న ప్రారంభించారు. అంతకు ముందే ఇచ్చిన నోటిఫికేషన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, ఎలాంటి అనుభవం లేకున్నా నియామకాలు చేపట్టారు. ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి పెట్రోల్‌ పంప్‌ నిర్వహణలో భాగస్వాములను చేశారు. 14 మంది పురుషులు, 10 మంది మహిళలు మొత్తంగా 24మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. షిఫ్ట్‌ పద్ధతిలో రోజుకు 8 గంటల చొప్పున విధులు కల్పించారు. ప్రస్తుతం నెలకు రూ.8,500 వేతనం అందిస్తున్నారు. పంప్‌లో వాహనదారులకు గాలి కొట్టే మిషన్‌, వాటర్‌, టాయిలెట్స్‌ను కూడా అందుబాటులోకి తెచ్చి సిబ్బంది ద్వారా నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రతి షిఫ్ట్‌లో పెట్రోల్‌ నాణ్యతను పరిశీలించాకే సిబ్బంది విధుల్లో చేరేలా నిబంధన పెట్టారు. వినియోగదారులు సైతం పెట్రోల్‌ నాణ్యతను పరిశీలించుకునే వీలు కల్పించారు. జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ పంప్‌లకు ఎలాంటి ఆదరణ లభించిందో దీనికి కూడా అలాంటి ఆదరణే వస్తున్నది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్‌ పంప్‌ కావడంతో వినియోగదారుల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది.

పోలీస్‌ శాఖకు ధన్యవాదాలు
నాకు ఇద్దరు పిల్లలు, నా భర్త ఆటో నడుపుతాడు. నేను కూడా ఏదైనా పనిచేయాలని అనుకుంటున్న సమయంలో పోలీస్‌శాఖ నోటిఫికేషన్‌ చూసి దరఖాస్తు చేసుకున్నా. ఇందులో ఉద్యోగావకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఏసీపీ సురేంద్ర, భారత్‌ పెట్రోలియం శాఖ సహకారం మరువలేనిది.
-ఎం మౌనిక, వంగపహాడ్‌, ఇంటర్‌

నాణ్యమైన ఇంధనం అందిస్తున్నాం
వినియోగదారులకు నాణ్యమైన ఇంధనం అందించడం, నిరుద్యోగులకు ఉపాధి చూపడం లక్ష్యంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పెట్రోల్‌ పంప్‌ ఏర్పాటు చేశాం. ప్రారంభించిన నాటి నుంచే వాహనదారుల తాకిడి పెరిగింది. ప్రజలు చాలా నమ్మకంగా వస్తున్నారు. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా నాణ్యమైన పెట్రోల్‌ అందిస్తాం.

  • ఏసీపీ సురేంద్ర, పెట్రోల్‌ పంప్‌ ఇన్‌చార్జి

పోలీస్‌ పెట్రోల్‌ పంప్‌ అనగానే నమ్మకంతో వచ్చేశా
గతంలో అలంకార్‌ సమీపంలోని ఓ పెట్రోల్‌ పంపులో పనిచేశా. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్‌ పంపు ఏర్పాటు చేస్తున్నారని తెలిసి నమ్మకంతో ఇందులో చేరా. గతంలో అనుభవం ఉన్నందున ఇంటర్వ్యూ లేకుండానే తీసుకున్నారు. రోజురోజుకూ ఇక్కడికి వచ్చే వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. మున్ముందు మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకముంది.
-కందకట్ల రంజిత్‌కుమార్‌, రేలకుంట్ల, నల్లబెల్లి మండలం

దరఖాస్తు చేసుకోగానే పిలిచారు
నేను ఇంటర్‌ వరకు చదివాను. ఇదే నా మొదటి ఉద్యోగం. నా భర్త ఆటోడ్రైవర్‌. మాకు ఇద్దరు పిల్లలు. ఒక్కరితో ఇల్లు గడవడం కష్టమని నేను కూడా ఏదైనా పని చేయాలని వెతుకుతున్న క్రమంలో పోలీస్‌శాఖ పెట్రోల్‌ పంపులో సేల్స్‌మెన్‌ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ పడ్డది. వెంటనే దరఖాస్తు చేసుకున్నా. ఇంటర్వ్యూ చేసి కొలువిచ్చారు. ఇక్కడ ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది.

  • కొలిపాక స్వప్నారాణి, టేకులగూడెం, ధర్మసాగర్‌ మండలం

వ్యవసాయ కూలీగా పనిచేసే నాకు పిలిచి నౌకరీ ఇచ్చారు
నేను ఊరిలోనే వ్యవసాయ కూలీకి పోయేది. ఇంటర్‌ చదివిన నాకు ఏదో ఒక ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలోనే పోలీస్‌ శాఖ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కావాలని నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇంటర్వ్యూ తర్వాత వారే స్వయంగా పిలిచి నౌకరి ఇచ్చిన్రు. నాకు ఎలాంటి అనుభవం లేకున్నా శిక్షణ ఇచ్చి పనిలో పెట్టుకున్నారు.

  • మొండెద్దుల కరుణాకర్‌, ఉప్పల్‌, కమలాపూర్‌ మండలం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆదరించి.. దారిచూపి..
ఆదరించి.. దారిచూపి..
ఆదరించి.. దారిచూపి..

ట్రెండింగ్‌

Advertisement