e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home జనగాం గిరిజనుల అభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం

గిరిజనుల అభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం

భీం ఆశయ సాధన కోసం పాటు పడాలి
సమస్యల పరిష్కారం దిశగా చర్యలు
కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో కృష్ణ ఆదిత్య
ఐటీడీఏలో కుమ్రంభీం వర్ధంతి

ఏటూరునాగారం, అక్టోబర్‌ 20 : గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ఐటీడీఏ లక్ష్యమని కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో కృష్ణ ఆదిత్య అన్నారు. మండల కేంద్రంలో తుడుందెబ్బ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కుమ్రంభీం వర్ధంతి నిర్వహించారు. ముందుగా మండలకేంద్రంలోని వై జంక్షన్‌లో భీం చిత్ర పటానికి ఎమ్మెల్యే సీతక్క, డీఎంహెచ్‌వో అప్పయ్య పూల మాలలు సమర్పించి నివాళులర్పించి తుడుందెబ్బ జెండా ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీగా ఐటీడీఏకు చేరుకున్నారు. కార్యాలయం ఆవరణలోని భీం విగ్రహం వద్ద వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య మాట్లాడారు. జల్‌, జంగిల్‌, జమీన్‌ నినాదాలతో పోరాటం చేసి ప్రాణాలు వదిలిన భీంను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం గిరిజనులు పాటు పడాలని కోరారు. వారి హక్కులు, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజనులకు విద్య, వైద్యం సకాలంలో అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆదివాసీలకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు, డిప్యూటీ డైరెక్టర్‌ మంకిడి ఎర్రయ్య, మహబూబాబాద్‌ డీటీడీవో దిలీప్‌కుమార్‌, వరంగల్‌ డీటీడీవో జహీరుద్దీన్‌, ఐటీడీఏ ఏవో దామోదర్‌స్వామి, ఎస్‌వో రాజ్‌కుమార్‌, మేనేజర్‌ లాల్‌ నాయక్‌, తుడుందెబ్బ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొడెం రత్నం, రాష్ట్ర నాయకులు పొడెం బాబు, రేగ నరేందర్‌, ఉద్యోగ సంఘం నాయకులు నల్లబోయిన కోటయ్య, కోటి రవి, మంకిడి బుచ్చయ్య, కాక భాస్కర్‌, పెనక ప్రభాకర్‌, కొమురం ప్రభాకర్‌, చెరుకుల ధర్మయ్య, వీసం నర్సయ్య, మంకిడి బుచ్చయ్య, కన్నాయిగూడెం జడ్పీటీసీ నామ చందు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, గుమ్మడి సోమయ్య, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య అందించాలి
నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా గిరిజన ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో కృష్ణ ఆదిత్య కోరారు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని డీటీడీవోలు, ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల సంక్షేమాధికారులతో బుధవారం విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గిరిజన విద్యార్థుల విద్యా నైపుణ్యాలు మెరుగుపడేలా పని చేయాలని సూచించారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయిలో వసతి సౌకర్యాలు కల్పిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఆశ్రమ పాఠశాల, వసతి గృహాల్లో వాటర్‌ ప్లాంటు, సోలార్‌ వాటర్‌ హీటర్స్‌, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాల వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేసి పూర్తి వివరాలు ఆయా డీటీడీవోలకు అందజేయాలని సూచించారు. ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల భూముల వివరాలు ధరణి వెబ్‌సైట్‌లో ఉన్నాయో లేదో పరిశీలించాలని డీటీడీవోలకు సూచించారు. కిచెన్‌, డైనింగ్‌ హాల్స్‌ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, వాటికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్‌ గ్రూపులో పంపించాలన్నారు. ఫుడ్‌ పాయిజన్‌ జరుగకుండా చూడాలని, గిరి దర్శిని ద్వారా విద్యా నైపుణ్యాల పెంపుదల, ఆన్‌లైన్‌ తరగతుల మానిటరింగ్‌ పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు అందాయా లేదా అనే విషయాన్ని ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు, డిప్యూటీ డైరెక్టర్‌ మంకిడి ఎర్రయ్య మహబూబాబాద్‌, హనుమకొండ, జనగామ డీటీడీవోలు జహీరుద్దీన్‌, దిలీప్‌కుమార్‌, ప్రేమకళ, ఏసీఎంవో సారయ్య, జీసీడీవో పద్మావతి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement