శనివారం 16 జనవరి 2021
Jangaon - Nov 28, 2020 , 03:23:35

అకాల వర్షంతో ఆగమాగం

అకాల వర్షంతో ఆగమాగం

  • ఎడతెరిపిలేని ముసురుతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
  • వరికోతల సమయంలో పంట నష్టం
  • ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు

పాలకుర్తి రూరల్‌ నవంబర్‌ 27 : తుఫాన్‌ ప్రభావంతో అకాల వర్షం కురిసి పంట నష్టం వాటిల్లింది. రెండు రోజులుగా కురుస్తున్న ముసురుతో అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన వరిపంట దెబ్బతింది. కోతకొచ్చిన దశలో వర్షం కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురాగా అకాల వర్షం నేపథ్యంలో రైతులు టార్పాలిన్లు కప్పారు. మండలంలోని ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. మరోవైపు వరికోతలు దాదాపు పూర్తయినా అకాల వర్షంతో పంట నష్టం జరుగుతున్నదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

దేవరుప్పులలో ఎడతెరిపిలేని ముసురు

దేఏవరుప్పుల : నివర్‌ తుఫాను ప్రభావంతో శుక్రవారం మండలంలో ఎడతెరిపిలేని ముసురుకురిసింది. అకాల వర్షానికి తోడు చలిగాలులు వీచడంతో రైతులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు పశువులకు మేత లేక అల్లాడుతున్నాయి. ఇప్పటికే వరి చేన్లు 90 శాతం మేరకు కోయగా, ధాన్యాన్ని రైతులు కల్లాల్లో ఆరబోశారు. వానతో కుప్పలుగా నూర్చి టార్పాలిన్‌ కప్పారు. వర్షాలు మరింత కురిస్తే ధాన్యం తడుస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పత్తి ఏరగా చేను మీద ఉన్న మిగిలిన పత్తి ఈ వానకు తడిసి నల్లగా మారుతున్నదని వాపోయారు. దీంతో రైతులకు తీరని నష్టం వాటిల్లందని పలువురు పేర్కొన్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌లో..

స్టేషన్‌ ఘన్‌పూర్‌ : పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్‌ కారణంగా రైతులు నష్టపోతున్న స్థితి మండలంలో నెలకొంది. నెమలిగొండ గ్రామం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం వరకు 7 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మరో 80 మందికిపైగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది. విశ్వనాథపురం గ్రా మంలో 830 బస్తాలు కాంటా పెట్టి లోడు పంపించడానికి సిద్ధంగా ఉందని రైతులు తెలిపారు. మూడు గ్రామాలకు చెందిన 40 మందికి పైగా రైతులకు సంబంధించి ఎనిమిది వేల బస్తాల వరకు కాంటా వేయాల్సి ఉందని పలువురు తెలిపారు. అకాల వర్షంతో టార్పాలిన్లతో ధాన్యం రాశులపై కప్పారు. కానీ వర్షాలు ఇలాగే కురిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.

తుఫాన్‌తో ఇబ్బంది పడుతున్నాం ..

రెండు రోజులుగా కురుస్తున్న ముసురుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆరుగాలం పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో ఎండబెట్టాం. వడ్లు ఎండుడు ఏమో గానీ తుఫాన్‌తో తడిసి ముద్దవుతున్నది. మొన్నటి వర్షాలతో పంటలు నష్టపోయినం. ఇప్పుడు కురుస్తున్న ముసురుతో ధాన్యం తడుస్తున్నది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.

- బెల్లి ఆశోక్‌, రైతు, దర్దేపల్లి