Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ (Mohammed Yunus) ఓ ఉగ్రవాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హసీనా జూమ్‌కాల్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నేను నా మాతృభూమికి తిరిగి వస్తా.. పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటా’ అంటూ ప్రతిజ్ఞ చేశారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు కాస్త ఓపికగా ఉండాలని సూచించారు. త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చి.. పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానన్నారు. గతంలో మాదిరిగానే అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. జులై – ఆగస్టుల్లో విద్యార్థుల ఆందోళనల్లో అనేక మంది మరణించారని.. పలువురు పోలీసులు, అవామీ లీగ్ కార్యకర్తలు, విద్యావంతులు, కళాకారులు హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ హత్యలకు కారణమైన వారిపై యూనస్ ఎందుకు చర్యలు తీసుకోలేదని హసీనా ప్రశ్నించారు.
దేశంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా అల్లర్లు ఆగడం లేదన్నారు. దేశంలో శాంతిభద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ కమిటీలను రద్దు చేసి యూనస్ ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలపైనా, అధికారులపైనా దాడులు చేయడం యూనస్ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ఈ ఉగ్రవాద ప్రభుత్వాన్ని దేశం నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాగా, రిజర్వేషన్ల అంశంలో చెలరేగిన వివాదం కారణంగా.. విద్యార్థుల నిరసనలకు జడిసి గతేడాది ఆగస్టు 5న ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం బంగ్లానుంచి పారిపోయి భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం భారత్‌లోనే ఆమె ఆశ్రయం పొందుతున్నారు.
Also Read..
USA | అక్కడ సజీవంగా 360 ఏళ్ల వ్యక్తి.. 200 ఏళ్లు దాటినవాళ్లూ 2 వేల మంది..!
Tesla | మోదీ-మస్క్ భేటీతో కీలక పరిణామం.. భారత్‌లో నియామకాలు చేపట్టిన టెస్లా
Nepali Students: ఇంజినీరింగ్ విద్యార్థుల గెంటివేత.. ఒడిశాకు నేపాలీ ఎంబసీ అధికారులు