భువనేశ్వర్: ఢిల్లీలోని నేపాల్(Nepali Students) ఎంబసీకి చెందిన ఇద్దరు అధికారులు ఇవాళ ఒడిశాలోని కళింగ ఇంజినీరింగ్ కాలేజీ విజిట్ చేయనున్నారు. రెండు రోజుల క్రితం ఓ విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నది. ఆ ఘటనను నిరసిస్తూ ఆ కాలేజీలో చదువుతున్న నేపాలీ విద్యార్థులు భారీ ఆందోళన నిర్వహించారు. దీంతో ఆ కాలేజీ యాజమాన్యం నిరసన చేస్తున్న విద్యార్థుల్ని.. బలవంతంగా కాలేజీ నుంచి గెంటివేసింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని.. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నది. ఆమెను ప్రకృతి లంసల్గా గుర్తించారు.
నేపాలీ విద్యార్థుల ఆందోళనతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొన్నది. విద్యార్థుల్ని క్యాంపస్ నుంచి తరిమేసిన అధికారులు.. వాళ్లను కటక్ రైల్వే స్టేషన్లో వదిలేశారు. ఈ ఘటన పట్ల నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ స్పందించారు. దౌత్యపరమైన రీతిలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తన ఫేస్బుక్లో తెలిపారు. ఒడిశాలో చిక్కుకున్న నేపాలీ విద్యార్థుల్ని కలుసుకునేందుకు ఇద్దరు ఎంబసీ అధికారులు వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. హాస్టల్లో ఉండే రీతిలో లేదా స్వదేశానికి తిరిగి వచ్చే రీతిలో చర్చలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ అమ్మాయి కజిన్ సోదరుడు భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. హాస్టల్ రూమ్‌లో తన సోదరి ఆత్మహత్య చేసుకున్నట్లు అతను ఫిర్యాదు నమోదు చేశాడు. ఓ స్టూడెంట్ తన సోదర్ని బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించాడు. దాని వల్లే ఆమె సూసైడ్ చేసుకున్నట్లు చెప్పాడు. కళింగ కాలేజీలో చదువుతున్న మరో విద్యార్థితో ఆ అమ్మాయికి అఫైర్ ఉందని, మరో కారణం చేత ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కాలేజీ యాజమాన్యం తెలిపింది.