Tesla | ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భారత్‌లో ఈ సంస్థ నియామకాల ప్రక్రియ చేపట్టింది (Tesla Begins Hiring In India). ఈ విషయాన్ని టెస్లా లింక్డిన్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో వివిధ పోస్టుల్లో ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టు వెల్లడించింది.
కస్టమర్ రిలేటెడ్, బ్యాక్ఎండ్ జాబ్ సహా 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ ప్రకటన చేసింది. ఇందులో సర్వీస్ టెక్నీషియన్, సలహదారు పోస్టులు వంటి వాటికి ఢిల్లీ, ముంబై నగరాల్లో నియామకాలు చేపడుతున్నట్లు తెలిపింది. మిగిలిన పోస్టులకు ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవలే అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)తో భేటీ అయ్యారు. ఆ భేటీలో వాణిజ్య అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా టెస్లా భారత్‌లో ప్రవేశానికి సంబంధించిన కీలక అంశాలను కూడా ఇరువురూ ప్రస్తావించినట్లు సమాచారం. మోదీతో భేటీ అయిన రోజుల వ్యవధిలోనే టెస్లా ఈ చర్యలు చేపట్టడం విశేషం.
ఎలన్ మస్క్ సారధ్యంలోని టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ విధించే దిగుమతి సుంకాలు తమకు అడ్డంకిగా మారాయని టెస్లా గతంలోనే పేర్కొంది. అయితే, 40 వేల డాలర్లకు పైబడిన ఖరీదైన కార్లపై భారత్ ఇప్పటివరకూ 110 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని విధించింది. ఇటీవల దాన్ని 70 శాతానికి తగ్గించింది.
Also Read..
Ranveer Allahbadia: ఆ మాటలు అసభ్యం కాదా? యూట్యూబర్‌పై సుప్రీంకోర్టు సీరియస్