న్యూఢిల్లీ: యూట్యూబ్ ఇన్‌ప్లూయెన్సర్ రణ్వీర్ అల్లాబదియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. యూట్యూబ్ షో కోసం అతను వాడిన భాషను అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని కోర్టు పేర్కొన్నది. అల్లాబదియా మెదడులో చెడు ఆలోచనలు ఉన్నాయని, వాటిని అతను యూట్యూబ్ షోలో కక్కేశాడని సుప్రీంకోర్టు పేర్కొన్నది. జస్టిస్ సూర్య కంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ అల్లాబదియా కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది.
సమాజానికి ఉన్న విలువలు, వాటి పరిమితిలు నీకు తెలుసా అని కోర్టు అతన్ని ప్రశ్నించింది. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని, వాటిని గౌరవించడం నేర్చుకోవాలని కోర్టు చెప్పింది. భావస్వేచ్ఛ పేరుతో.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు అని కోర్టు తెలిపింది. సమాజ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవరికీ లేదని కోర్టు పేర్కొన్నది. నీవు మాట్లాడిన తీరుతో కూతుళ్లు, సోదరీమణులు, పేరెంట్స్, సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని యూట్యూబర్ అల్లాబదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
నువ్వు మాట్లాడిన మాటలు అసభ్యం, అశ్లీలం కాదా, ఎందుకు నీపై నమోదు అయిన ఎఫ్ఐఆర్లను ఒక్కటి చేయాలి, వాటిని ఎందుకు కొట్టివేయాలని సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో యూట్యూబర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. పాపులారిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, అప్పుడు నిన్న చూసి జనం పబ్లిసిటీ కోసం ఇతరుల్ని బెదిరించే అవకాశం ఉన్నదని సుప్రీంకోర్టు చెప్పింది.
ఓ యూట్యూబ్ షోలో.. పేరెంట్స్ సెక్స్ గురించి రణ్వీర్ అల్లాబదియా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అతనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ అతనికి కానీ, అతని కుటుంబానికి కానీ ప్రాణహాని బెదిరింపులు వస్తే, అప్పుడు అతను పోలీసుల్ని ఆశ్రయించవచ్చు అని కోర్టు చెప్పింది. అల్లాబదియాపై కొత్తగా ఎటువంటి కేసులు నమోదు చేయవద్దు అని కోర్టు స్పష్టం చేసింది.