Gyanesh Kumar | భారత ప్రధాన ఎన్నికల అధికారిగా (Chief Election Commissioner) కేరళ క్యాడర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కొత్త సీఈసీ ఎంపిక కోసం సమావేశం జరిగింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఈసీ ఎంపిక కమిటీ సమావేశమై జ్ఞానేశ్ కుమార్ పేరును ఖరారు చేశారు. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్‌గా వివేక్ జోషి పేరును ఖరారు చేశారు. సీఈసీ, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆయోదించారు. ఆ వెంటనే ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది.
జ్ఞానేశ్ కుమార్.. కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన వయసు 61 ఏండ్లు. 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంలో ఆయన హోంమంత్రిత్వ శాఖలో (కశ్మీర్ డివిజన్) సేవలు అందించారు. 370 రద్దు కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడైన జ్ఞానేశ్.. హోం శాఖలో సంయుక్త కార్యదర్శిగా గతేడాది జనవరి 31న రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత అదే ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా నియమితులయ్యారు.
జ్ఞానేశ్ పర్యవేక్షణలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు
ఇక సీఈసీగా 2029 జనవరి 26వ తేదీ వరకూ కొనసాగనున్నారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివరిలో బిహార్, వచ్చే ఏడాదిలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఆయన హయాంలోనే 2027లో జరుగుతాయి. మరోవైపు ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులైన వివేక్ జోషి హర్యాణా క్యాడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన హర్యాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్
కాగా, జ్ఞానేశ్ కుమార్ ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. ICFAIలో బిజినెస్ ఫైనాన్స్, యూఎస్‌లోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ పూర్తి చేశారు. గతంలో కేరళ ప్రభుత్వంలో ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్‌గా, అదూర్ సబ్ కలెక్టర్‌గా, ఎస్సీ ఎస్టీల కోసం కేరళ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, కొచ్చిన్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్‌గా, కేరళ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, పరిశ్రమలు, వాణిజ్య డైరెక్టర్‌గా, ఎర్నాకులం జిల్లా కలెక్టర్‌గా, గోశ్రీ లాండ్స్ డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శిగా, త్రివేండ్రం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా, ఢిల్లీలోని కేరళ హౌస్ రెసిడెంట్ కమిషనర్‌గా కూడా పనిచేశారు.
Also Read..
Nepali Students: ఇంజినీరింగ్ విద్యార్థుల గెంటివేత.. ఒడిశాకు నేపాలీ ఎంబసీ అధికారులు
Water Crisis | బెంగళూరులో నీటి సంక్షోభం.. డ్రింకింగ్ వాటర్‌ను వృథా చేస్తే భారీ జరిమానా
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ