అయిజ: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని బైనపల్లి గ్రామంలో మారెమ్మ అవ్వ ఆలయంలో చోరీ (Robbery) జరిగింది. సోమవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు హుండీని ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల కథనం మేరకు.. బైనపల్లి గ్రామంలోని మారెమ్మ అవ్వ దేవాలయం ఉంది. గ్రామస్తులచే నిత్యం పూజలందుకుంటున్న ఆలయంలో భక్తులు కానుకల రూపంలో నగదు, వెండి, బంగారు మొక్కుబడులను హుండీలో సమర్పిస్తుంటారు.
సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని హుండీని ధ్వంసం చేసి నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మహిమాన్విత కలిగిన మారెమ్మ దేవాలయంలోనే హుండీ లోని నగదు చోరీకి గురికావడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయాన్ని పరిశీలించారు. హుండీ చోరీకి గురైన విధానంపై కూపీ లాగుతున్నారు.