Israel-Iran | ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై ఖమేనీ తాజాగా స్పందించారు. లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు అమెరికా సైనిక జోక్యం వల్ల కోలుకోలేని నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ మేరకు ఖమేనీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ‘ఇరాన్ దేశ చరిత్ర తెలిసిన తెలివైన వ్యక్తులు ఈ దేశంతో ఎప్పుడూ బెదిరింపు ధోరణితో మాట్లాడరు. ఎందుకంటే ఇరాన్ దేశం ఎన్నటికీ లొంగిపోదు. అమెరికా సైనిక జోక్యం చేసుకుంటే.. నిస్సందేహంగా కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయాన్ని అమెరికన్లు తెలుసుకోవాలి’ అని సుప్రీం లీడర్ హెచ్చరించారు.
ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తెలుసు..
ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వెల్లడించారు. అయితే ఖమేనీ చావును ప్రస్తుతానికి తాము కోరుకోవడం లేదని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా బేషరతుగా లొంగిపోవాలని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కేవలం కాల్పుల విరమణను మాత్రమే తాను కోరుకోవడం లేదని, అంతకన్నా మెరుగైన పరిష్కారాన్నే తాను కోరుకుంటున్నానని ట్రంప్ ప్రకటించారు. జీ7 సదస్సును అర్ధాంతరంగా ముగించుకుని సోమవారం రాత్రి కెనడా నుంచి వాషింగ్టన్కు తిరిగివస్తూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
Also Read..
Iran | ఇరాన్‌తో యుద్ధంలో క్షీణిస్తున్న ఇజ్రాయెల్ గగనతల రక్షణ నిల్వలు.. మరో 10- 12 రోజుల్లో..!
Iran | తమ డివైజ్‌ల నుంచి వాట్సాప్‌ను తొలగించాలని ప్రజలకు ఇరాన్ సూచన.. మెటాపై సంచలన ఆరోపణలు
Israel-Iran | ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 585 మంది మృతి