Myanmar | మయన్మార్ (Myanmar), థాయ్‌లాండ్ దేశాలను అత్యంత శక్తిమంతమైన భూకంపాలు (Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఈ విలయానికి మయన్మార్ తీవ్రంగా దెబ్బతింది. అక్కడ మరణించిన వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ 1,700 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మయన్మార్ స్టేట్ మీడియా నివేదిస్తోంది. అయితే, ఆ సంఖ్య 2,028 అని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
3వేల మందికిపైగా గాయపడ్డట్లు పేర్కొంది. వేలాది మంది ప్రజలు శిథిలాల (rubbles) కింద చిక్కుకుపోయారు. వారికోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఓ మిరాకిల్ చోటు చేసుకుంది. భూకంపం సంభవించిన మూడు రోజుల అనంతరం సహాయక సిబ్బంది ఓ మహిళను సజీవంగా శిథిలాల కింద గుర్తించి రక్షించారు. మాండలేలోని గ్రేట్‌వాల్ హోటల్ శిథిలాల నుంచి ఆమెను బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు. సదరు మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
మయన్మార్‌తోపాటు థాయ్‌లాండ్‌లో ఈ నెల 28న 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణు బాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనాన్ని సృష్టించిందని స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశముందని ఆమె హెచ్చరించారు. ప్రస్తుత విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశముందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంచనా వేస్తున్నది.
Also Read..
Earthquake | భూ ప్రకోపం తీరని శాపం.. మానవాళిపై పెను ప్రభావం
Earthquake | మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదు