Earthquake | పసిఫిక్ మహాసముద్రంలోని టొంగా దీవుల్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. ఈ భూకంపం పంగైకి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. తీవ్ర ప్రకంపనలతో భూమి కంపించడంతో నియు ద్వీపం సునామీ ప్రభావం ఉండే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. నియు, టోంగా తీరాల్లో అలల స్థాయి 0.3 మీటర్ల నుంచి మీటర్ వరకు పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంది. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని, తీర ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారంతా తూర ప్రాంతానికి దూరంగా ఉండాలని.. ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లాలని టొంగా నేషనల్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ కార్యాలయం సోషల్ మీడియా వేదికగా కోరింది. వాస్తవానికి టొంగాలో భూకంపాలు సాధారణంగా వస్తుంటారు. ఇది తక్కువ ఎత్తులో ఉన్న ద్వీపాల సముహం. ఇక్కడ కేవలం లక్ష మంది జనం మాత్రమే నివాసం ఉంటారు. ఆగ్నేయ ఆసియా గుండా పసిఫిక్ బేసిన్ వరకు విస్తరించి ఉన్న తీవ్రమైన టెక్టోనిక్ కార్యకలాపాల ప్రాంతమైన ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్లో ఉంటుంది. ఇదిలా ఉండగా.. రెండు రోజుల కిందట మయన్మార్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. తీవ్రమైన ప్రకంపనల ధాటికి భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇప్పటి వరకు 1600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంకా మయన్మార్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.